ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

క్రిస్టియన్‌ డాప్లర్‌

ఈయన ఆస్ట్రియాకు చెందిన ప్రసిద్ధ గణిత, భౌతిక, ఖగోళ శాస్త్రవేత్త. కాంతి, ధ్వని తరంగాలపై అనేక పరిశోధనలు చేశారు. ఈ క్రమంలోనే ‘డాప్లర్‌ ఎఫెక్ట్‌’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.


ఈయన ఆస్ట్రియాకు చెందిన ప్రసిద్ధ గణిత, భౌతిక, ఖగోళ శాస్త్రవేత్త. కాంతి, ధ్వని తరంగాలపై అనేక పరిశోధనలు చేశారు. ఈ క్రమంలోనే ‘డాప్లర్‌ ఎఫెక్ట్‌’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఇది వైద్యరంగంతో సహా ఆధునిక భౌతికశాస్త్రం, టెక్నాలజీ రంగంలో అనేక నూతన ఆవిష్కరణలకు కారణమైంది. వివిధ శాస్త్రీయ రంగాల్లో ప్రాథమిక సూత్రంగా మారిన డాప్లర్‌ ఎఫెక్ట్‌ను కనిపెట్టిన క్రిస్టియన్‌ డాప్లర్‌ జయంతి నేడు (నవంబరు 29). ఈ సందర్భంగా ఈయన జీవితంలోని ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం..!

బాల్యం - వృత్తి జీవితం

  • డాప్లర్‌ 1803, నవంబరు 29న ఆస్ట్రియాలోని సాల్జ్‌బర్గ్‌లో జన్మించారు. 13 ఏళ్ల వయసులో ప్రాథమిక విద్యను ప్రారంభించారు. మాధ్యమిక విద్య కోసం లింజ్‌లోని పాఠశాలలో చేరారు. అక్కడ గణితాన్ని బోధించే సూమన్‌ స్టాంఫర్‌ ఈయనలోని మ్యాథ్స్‌ ప్రావీణ్యాన్ని గుర్తించారు. ఆయన సూచన మేరకు 1822లో వియన్నాలోని పాలిటెక్నిక్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. అక్కడ గణితం, భౌతికశాస్త్రానికి సంబంధించిన అనేక విషయాలను నేర్చుకున్నారు. 
  • 1837లో ఆయన ప్రేగ్‌ పాలిటెక్నిక్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ప్రస్తుతం చెక్‌ టెక్నికల్‌ యూనివర్సిటీ పేరుతో ఉంది)లో గణితం బోధించే అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. 1941లో ప్రొఫెసర్‌ హోదా పొందారు.
  • ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఆయన అనేక అంశాలపై పరిశోధనా పత్రాలను ప్రచురిస్తూ ఉండేవారు. 

డాప్లర్‌ ఎఫెక్ట్‌ 

  • డాప్లర్‌ 1842లో ప్రేగ్‌లోని రాయల్‌ బొహేమియన్‌ సొసైటీ ఆఫ్‌ ది సైన్సెస్‌కు On the colored light of the double stars and certain other stars of the heavense అనే పత్రాన్ని సమర్పించారు. 
  • అదే డాప్లర్‌ ఎఫెక్ట్‌గా స్థిరపడింది. దీని ప్రకారం, పరిశీలకుడు (అబ్జర్వర్‌), ధ్వని జనకాల మధ్య సాపేక్ష చలనం ఉన్నప్పుడు పరిశీలకుడు వినే పౌనఃపున్యంలో దృశ్య మార్పు కలగడాన్ని డాప్లర్‌ ప్రభావం అంటారు. 
  • ఇది ధ్వనితో పాటు కాంతి తరంగాలకు కూడా వర్తిస్తుంది. 
  • ధ్వని జనకం అబ్జర్వర్‌ని సమీపిస్తున్నప్పుడు దృశ్య పౌనఃపున్యం పెరుగుతుంది. అదే పరిశీలకుడి నుంచి దూరంగా వెళ్తే దృశ్య పౌనఃపున్యం క్రమంగా తగ్గుతుంది.

అవార్డులు - గౌరవాలు

  • 1840లో డాప్లర్‌ రాయల్‌ బొహేమియన్‌ సొసైటీ ఆఫ్‌ ది సైన్సెస్‌లో సభ్యుడిగా చేరారు. ఇదే ఆయన జీవితంలోని అత్యున్నత అధికారిక గుర్తింపు.
  • డాప్లర్‌ తన జీవిత కాలంలో ఎలాంటి ముఖ్యమైన అవార్డులను పొందలేదు. అయితే మరణానంతరం ఆయన పేరుపై అనేక అవార్డులను ఇతరులకు ప్రదానం చేశారు. 
  • క్రిస్టియన్‌ డాప్లర్‌ పేరుతో సాల్జ్‌బర్గ్‌ ఫెడరల్‌ ప్రభుత్వం ఆయా రంగాల్లో విశేష కృషి చేసిన వారికి బహుమతులు అందిస్తోంది.

చివరగా..

  • మానవాళి అభ్యున్నతికి ఉపయోగపడే అనేక ఆవిష్కరణలకు ‘డాప్లర్‌ ఎఫెక్ట్‌’ కారణమైంది. ఆయన ఆలోచనలు, పరిశోధనలు నేటికీ ఎందరో పరిశోధకులకూ స్ఫూర్తిని కలిగిస్తూనే ఉన్నాయి. భౌతిక, ఖగోళ శాస్త్రాల్లో సాంకేతికతను మెరుగుపరచడానికి, పరిశోధనలను ముందుకు తీసుకెళ్లడానికి ఈయన పరిశోధనా పత్రాలు మార్గదర్శిగా నిలిచాయి. ఈయన 1853, మార్చి 17న ఇటలీలోని వెనిస్‌లో మరణించారు.

 


Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram