విద్యుత్ వాహనాలకు అనువైన వాతావరణాన్ని కల్పించడంలో దేశంలోని 36 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ 9, తెలంగాణ 10వ స్థానంలో నిలిచాయి. నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన ‘ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్-2025’ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. 2024తో పోలిస్తే ఏపీ ఒకటి, తెలంగాణ రెండు స్థానాలు ఎగబాకాయి.
రాష్ట్రాల్లో విద్యుత్ వాహనాల ప్రోత్సాహానికి అందిస్తున్న చేయూత ఆధారంగా నీతి ఆయోగ్ ఈ ర్యాంకులు ఇచ్చింది. 65%కి పైగా మార్కులు సాధించిన రాష్ట్రాలను టాప్ పెర్ఫార్మర్స్‌గా, 50-64 మధ్యలో మార్కులు వచ్చిన వాటిని ఫ్రంట్ రన్నర్స్‌గా, 35-49 మధ్య వస్తే ఎమర్జింగ్ పెర్ఫార్మర్స్‌గా, 35లోపు అయితే యాస్పిరెంట్స్ స్టేట్స్‌గా ప్రకటించింది.