దేశంలో పన్ను సంస్కరణల కమిటీలు (పార్ట్‌ - 2)

దేశంలో పన్ను సంస్కరణల కమిటీలు (పార్ట్‌ - 2)

భారతదేశంలో పన్ను వసూలును సులభతరం చేయడానికి, పారదర్శకతను మెరుగుపరచడానికి, పన్ను చెల్లింపుదారుల సౌకర్యాన్ని పెంచడానికి వివిధ పన్ను సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఈ సంస్కరణలు డిజిటలైజేషన్, పన్ను వివాదాలు తగ్గించడం, పన్ను పరిధిని విస్తరించడం, ట్యాక్స్‌ పేయర్స్‌కు అనుకూలమైన పన్నుల వ్యవస్థను సృష్టించడంపై దృష్టిసారించాయి. మెరుగైన పన్ను విధానాలు రూపొందించడంలో ప్రభుత్వానికి వివిధ నిపుణుల కమిటీలు సాయపడ్డాయి. పార్ట్‌-1లో పన్ను అంటే ఏమిటి, పన్ను సంస్కరణలు - వాటిని సూచించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముఖ్యమైన కమిటీల గురించి తెలుసుకున్నాం. ఈ భాగంలో మరికొన్నింటి వివరాలు చూద్దాం!

కేఎన్‌ రాజ్‌ కమిటీ

దీన్ని ‘వ్యవసాయ సంపద, ఆదాయంపై పన్నుల కమిటీ’ (Committee on Taxation of Agricultural Wealth and Income) అని కూడా అంటారు. ప్రభుత్వం 1972లో ఏర్పాటు చేసింది. ప్రఖ్యాత ఆర్థికవేత్త డాక్టర్‌ కేఎన్‌ రాజ్‌ (కక్కడన్‌ నందరాథ్‌ రాజ్‌) దీనికి అధ్యక్షత వహించారు. 1951లో ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ పార్లమెంట్‌కు సమర్పించిన మొదటి పంచవర్ష ప్రణాళికకు ఈయనే ప్రధాన రూపశిల్పి, ముసాయిదా రచయిత. ఈ కమిటీ 1972, అక్టోబరులో తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.

సి.సి.చోక్సీ కమిటీ

కేంద్రం 1977లో ప్రముఖ చార్టెర్డ్‌ అకౌంటెంట్‌ చినుభాయ్‌ చిమన్‌లాల్‌ చోక్సీ (సి.సి.చోక్సీ) అధ్యక్షతన దీన్ని ఏర్పాటు చేసింది. దీన్నే ప్రత్యక్ష పన్ను చట్టాల కమిటీ (Direct Tax Laws Committee) అని కూడా అంటారు. చోక్సీ 1959-60లో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెర్డ్‌ అకౌంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు. ఈ కమిటీ 1977, డిసెంబరులో తన మధ్యంతర నివేదికను; 1978, సెప్టెంబరులో తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. 

ఎల్‌.కె.ఝా కమిటీ

దీన్ని ఇందిరా గాంధీ ప్రభుత్వం 1981లో ప్రముఖ ఆర్థికవేత్త లక్ష్మీకాంత్‌ ఝా (ఎల్‌.కె.ఝా) అధ్యక్షతన ఏర్పాటు చేసింది. దీన్నే ఆర్థిక పరిపాలన సంస్కరణల కమిషన్‌ (Economic Administration Reforms Commission - EARC) అని కూడా అంటారు. ఎల్‌.కె.ఝా 1967 నుంచి 1970 వరకు ఆర్‌బీఐ గవర్నర్‌గా వ్యవహరించారు. ఈ కమిటీ 1981 నుంచి 1984 మధ్య కాలంలో ప్రభుత్వానికి 37 వేర్వేరు నివేదికలు సమర్పించింది. 

ఆర్‌.చెల్లయ్య కమిటీ 

పన్ను విధానాన్ని సంస్కరించడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ప్రభుత్వం 1991లో ప్రొఫెసర్‌ రాజా చెల్లయ్య నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీన్నే ‘పన్ను సంస్కరణల కమిటీ’ అని కూడా అంటారు. చెల్లయ్యను పన్నుల విధాన పితామహుడు లేదా పన్ను సంస్కరణల పితామహుడిగా పేర్కొంటారు. ఇది 1991, 1992, 1993లో మూడు నివేదికలను ప్రభుత్వానికి సమర్పించింది. 

ప్రొఫెసర్‌ విజయ్‌ కేల్కర్‌ కమిటీ 

దీన్ని కేంద్ర ప్రభుత్వం 2002లో ఏర్పాటు చేసింది. ప్రొఫెసర్‌ విజయ్‌ కేల్కర్‌ దీనికి నేతృత్వం వహించారు. దీన్ని ప్రత్యక్ష, పరోక్ష పన్నులపై టాస్క్‌ఫోర్స్‌ (Task Force on Direct and Indirect Taxes) అంటారు. విజయ్‌ కేల్కర్‌ 13వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఈ కమిటీ 2002, డిసెంబరులో తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.

పార్థసారథి షోమ్‌ కమిటీ

దీన్ని షోమ్‌ ప్యానెల్‌ అని పిలుస్తారు. ఈ కమిటీని 2012, జులైలో ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ఏర్పాటు చేసింది. జనరల్‌ యాంటీ అవాయిడెన్స్‌ రూల్స్‌ (జీఏఏఆర్‌)కు సంబంధించిన మార్గదర్శకాలను సమీక్షించి, ఖరారు చేయడం; నాన్‌-రెసిడెంట్‌ పెట్టుబడిదారులకు పన్ను విషయాల్లో స్పష్టత కల్పించడం దీని ప్రధాన బాధ్యతలు. ఈ కమిటీ తన తుది నివేదికను 2012, సెప్టెంబరు 30న సమర్పించింది. 

ఆయా కమిటీల ఇతర ముఖ్య సమాచారంతోపాటు గతంలో యూపీఎస్సీ సివిల్స్, ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌-డి, ఎస్‌ఎస్‌సీ - ఎంటీఎస్, సీహెచ్‌ఎస్‌ఎల్, యూజీసీ నెట్‌ తదితర పోటీపరీక్షల్లో ఈ అంశంపై అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సుII’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. చెల్లయ్య కమిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?

(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ (యూజీ), 2025)

1) 1986       2) 1991           3) 1992       4) 2002

సమాధానం: 2

2. కింది ఏ రంగంలో సంస్కరణలు సిఫార్సు చేయడానికి రాజా చెల్లయ్య కమిటీని నియమించారు?

(దిల్లీ పోలీస్‌ కానిస్టేబుల్‌ (ఎగ్జిక్యూటివ్‌), 2026)

1) పన్ను విధానం               2) స్టాక్‌ మార్కెట్‌

3) అంతరిక్ష సాంకేతికత            4) క్రీడలు

సమాధానం: 1

3. కేల్కర్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ పన్ను సంస్కరణలకు సంబంధించిన సిఫార్సులు ఏ సంవత్సరంలో చేసింది?

(ఎంపీఎస్సీ సబార్డినేట్‌ సర్వీసెస్‌ మెయిన్స్, 2022)

1) 2002       2) 2004       3) 2006       4) 2007

సమాధానం: 1

4. మన దేశంలో వ్యవసాయ భూమిపై పన్ను విధించాలని ఏ కమిటీ సిఫార్సు చేసింది?

(యూపీ పీజీటీ, 2019)

1) టాండన్‌ కమిటీ             2) రాజ్‌ కమిటీ

3) కేల్కర్‌ కమిటీ              4) ఏదీకాదు

సమాధానం: 2

5. What did the Tax Reforms Committee recommend for Wealth Tax in 1991?
(RRB NTPC (Graduate) CBT-I, 2026)
1) restructuring of estate duty        2) removal of gift tax
3) abolition of wealth tax            4) rationalisation of property tax
Ans: 3
6. The Chelliah Committee recommended in January ____ that the prevailing rates of import duties be rationalised and lowered.
(SSC MTS, 2026)
1) 1991        2) 1995        3) 1996        4) 1993
Ans: 4
7. Who among the following is known as the architect of Indian planning?
(RRB Group D, 2022)
1) Dhananjay Ramchandra Gadgil        2) Dattatreya Gopal Karve
3) Prasanta Chandra Mahalanobis        4) Kakkadan Nandanath Rajan
Ans: 3
8. Who was the chairman of the Tax Reforms Committee 1991?
(SSC CHSL, 2025)
1) Manmohan Singh        2) P. Chidambaram
3) Raja J. Chelliah            4) Shakti Kant Das
Ans: 3

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram