కృత్రిమ మేధ (ఏఐ), నాలెడ్జ్ క్యాపిటల్, డిజిటల్ ఆవిష్కరణలతో నడిచే భారత నవతరం ఆర్థిక వ్యవస్థ(న్యూ-ఏజ్ ఎకానమీ) వార్షిక ఆదాయం 2030-31 ఆర్థిక సంవత్సరం నాటికి మూడు రెట్లు పెరిగి 300 బి.డాలర్లు (రూ.28.5 లక్షల కోట్లు)కు చేరొచ్చని రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ తన నివేదికలో పేర్కొంది. మన దేశ ఐటీ సేవల రంగం స్థాయికి ఇది చేరుకోనుండటం విశేషం.
నివేదికలోని అంశాలు:
దేశీయ న్యూ-ఏజ్ కంపెనీల ఉమ్మడి ఆదాయం 2021-22లో 33 బి.డాలర్ల నుంచి 2025-26కి 100 బి.డాలర్లకు చేరుకుంది. అక్కడ నుంచి ఏటా 25% వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్)తో 2030-31 నాటికి 300 బి.డాలర్ల మైలురాయికి చేరనుంది.
కన్జూమర్ గూడ్స్, రిటెయిల్, లీజర్ వంటి వినియోగ ఆధారిత రంగాలు ఏటా 25% వృద్ధితో 150 బి.డాలర్లకు చేరి, మొత్తం మార్కెట్‌లో సగం వాటాను దక్కించుకోనున్నాయి. టీఎంటీ, ఏఐ, అధునాతన తయారీ రంగాలు ఏటా 26% చొప్పున వేగంగా దూసుకెళ్లనున్నాయి.