దేశవ్యాప్తంగా 2026, జులైలో స్థూల జీఎస్‌టీ వసూళ్లు 15.4 శాతం పెరిగి రూ.2.11 లక్షల కోట్లకు చేరాయి. జీఎస్‌టీ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత వసూళ్లపరంగా ఇది మూడో గరిష్ఠం. 2026, ఏప్రిల్‌లో వసూలైన రూ.2.43 లక్షల కోట్లు, 2025 ఏప్రిల్‌లో వసూలైన రూ.2.37 లక్షల కోట్లు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
విక్రయాలు, దిగుమతుల ద్వారా అత్యధిక వసూళ్లు రావడం వల్లే జులైలో భారీగా జీఎస్‌టీ వసూళ్లు నమోదయ్యాయి. దేశీయ విక్రయాలపై జీఎస్‌టీ వసూళ్లు 10.1 శాతం పెరిగి రూ.1.44 లక్షల కోట్లకు చేరాయి. దిగుమతులపై జీఎస్‌టీ వసూళ్లు 29 శాతం పెరిగి రూ.66,511 కోట్లుగా నమోదయ్యాయి.