గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లు ఏడు స్వర్ణాలు, 3 రజతాలు కైవసం చేసుకున్నారు. ప్రీతి పవార్ (54 కిలోలు), జైస్మిన్ లాంబోరియా (57 కిలోలు), సాక్షి చౌదరి (51 కిలోలు), ప్రియ ఘంఘాస్ (60 కిలోలు), అరుంధతి చౌదరి (70 కిలోలు)లతోపాటు సచిన్ సివాచ్ (60 కిలోలు), అంకుశ్ పంఘాల్ (80 కిలోలు) పసిడి పతకాలు సొంతం చేసుకున్నారు. లవ్లీనా బోర్గోహైన్ (75 కిలోలు), జాదుమణి సింగ్ (55 కిలోలు), నరేందర్ బెర్వాల్ (90+ కిలోలు) రజతాలు గెలిచారు. 2026, ఆగస్టు 1న జరిగిన ఫైనల్లో వీరు ఇవి సాధించారు.
ప్రీతి పవార్.. మహిళల 54 కిలోల ఫైనల్లో 5-0తో స్కార్లెట్ సవానా (కెనడా)ను ఓడించి, బాక్సింగ్‌లో భారత్‌కు తొలి స్వర్ణం అందించింది. ప్రీతి కామన్వెల్త్‌లో తొలిసారి తలపడుతూ పోడియంలో అగ్రస్థానం సాధించింది.
తర్వాత జైస్మిన్ లాంబోరియా (57 కిలోలు) 5-0తో మైకెలా వాల్ష్ (ఉత్తర ఐర్లాండ్)పై ఘనవిజయం సాధించగా.. సాక్షి చౌదరి (51 కిలోలు) అంతే స్కోరుతో రూబీ వైట్ (ఇంగ్లాండ్)ను మట్టికరిపించింది.
ప్రియ ఘంఘాస్ (60 కిలోలు) 4-1తో మేరీ బాతోల్ (కెనడా)పై నెగ్గింది.
ఏకపక్ష పోరులో అరుంధతి 5-0తో షాంటెలె రీడ్ (ఇంగ్లాండ్)ను ఓడించి తొలి కామన్వెల్త్ స్వర్ణాన్ని ఖాతాలో వేసుకుంది.
అయితే స్టార్ బాక్సర్, ఒలింపిక్ కాంస్య విజేత లవ్లీనా బొర్గొహెయిన్ (75 కిలోలు) మాత్రం పసిడి గెలవలేకపోయింది. ఆమె ఫైనల్లో 1-4తో ఏమా గ్రీన్‌ట్రీ (ఆస్ట్రేలియా) చేతిలో పరాజయం పాలై రజతంతో సరిపెట్టుకుంది.
పురుషుల్లో సచిన్ సివాచ్ (60 కిలోలు), అంకుశ్ పంఘాల్ (80 కిలోలు) పసిడి పతకాలు నెగ్గారు. ఫైనల్లో సచిన్ సివాచ్ 3-2తో మార్నింగ్ ఎండెవెలో (నమీబియా)ను ఓడించాడు. అంకుశ్ పంఘాల్ 4-1తో దిమేజి షితు (ఇంగ్లాండ్)ను చిత్తు చేశాడు.
55 కిలోల విభాగంలో జాదుమణి సింగ్ రజతానికి పరిమితమయ్యాడు. అతడు 0-5తో జై డిక్సన్ (ఆస్ట్రేలియా) చేతిలో పరాజయం పాలయ్యాడు. బాక్సింగ్‌లో భారత్ తరఫున చివరగా బరిలోకి దిగిన నరేందర్ బెర్వాల్ కు రజతమే దక్కింది. 90+ కిలోల విభాగం ఫైనల్లో అతడు 0-5తో డామర్ థామస్ (ఇంగ్లాండ్) చేతిలో ఓడిపోయాడు. ఒక కామన్వెల్త్ క్రీడల బాక్సింగ్‌లో భారత్ గెలిచిన అత్యధిక పసిడి (7) పతకాలివే. 2018 సీడబ్ల్యూజీలో భారత బాక్సర్లు 3 స్వర్ణాలు సాధించారు.