‘పరిశ్రమ’ నిర్వచనంపై సుప్రీంకోర్టు 2026, ఆగస్టు 20న కీలక తీర్పు వెలువరించింది. దాదాపు 48 సంవత్సరాల క్రితం పరిశ్రమ అనే మాటకు సుప్రీంకోర్టు ఇచ్చిన విస్తృత నిర్వచనం 2020 నాటి పారిశ్రామిక కోడ్ కింద నమోదయ్యే కొత్త కేసులకు వర్తించదని స్పష్టం చేసింది. 1978లో ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన నిర్వచనంలో మూడు ప్రధాన అంశాలు ఉన్నాయని, ప్రస్తుత తీర్పులో వాటికి మెరుగులు దిద్దామని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో పాత నిర్వచనాన్ని మార్చినట్టైంది.
ఈ అంశంపై విచారణ జరిపిన 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌తో సహా ఆరుగురు ఈ నిర్ణయానికి అనుకూలంగా, ముగ్గురు ప్రతికూలంగా తీర్పు వెలువరించారు. ‘బెంగళూరు వాటర్ సప్లై’ కేసుకు సంబంధించి 1978 నాటి తీర్పులో ‘పరిశ్రమలో ఉండాల్సిన మూడు అంశాలను’ కోర్టు పేర్కొంది. ఆ మూడు అంశాలకు, అందుకు సంబంధించిన మార్గదర్శకాలకు మెరుగులు అవసరమని ఆగస్టు 20న సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అయితే 1978 తీర్పులోని ప్రాథమిక చట్రం ఇప్పటికీ వర్తిస్తుందని ధర్మాసనం తెలిపింది.