2024లో దేశవ్యాప్తంగా నిమిషానికి సగటున 48 జననాలు, 17 మరణాలు నమోదైనట్లు ఇటీవల విడుదలైన సీఆర్‌ఎస్ నివేదిక పేర్కొంది. 2023లో దేశ జనాభా నికర పెరుగుదల 1,65,47,391 ఉంటే.. 2024లో 12,303 తగ్గి 1,65,35,088 మాత్రమే నమోదైంది. మొత్తం జనాభా 140 కోట్లకు చేరింది. జననాలు పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లో 14% తక్కువగా ఉంటే మరణాలు 14% పెరిగాయి. దేశవ్యాప్తంగా 2024 జనవరి ఒకటో తేదీ నుంచి డిసెంబరు వరకు జారీ చేసిన జనన, మరణ ధ్రువీకరణ పత్రాల ఆధారంగా మొత్తం 2.54 కోట్ల మంది పుట్టగా, 89.38 లక్షల మంది కన్నుమూశారు. అంటే నికరంగా దేశజనాభా 1.65 కోట్లు పెరిగింది. 2023లో జననాలు 2.52 కోట్లుండగా.. 2024లో 2.54 కోట్లకు పెరిగాయి. అయితే మరణాలు అధికంగా ఉన్నందున నికర జనాభా 12,303 తగ్గింది. దేశచరిత్రలో 2021 తరవాత అత్యధిక మరణాలు 2024లో నమోదయ్యాయి. 2021లో 1.01 కోట్ల మరణాలుంటే 2024లో 89.38 లక్షలు సంభవించాయి. ఇది 2023లో నమోదైన 86.60 లక్షలకన్నా అధికం.