ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన 71వ వార్షికోత్సవం సందర్భంగా, 53 కోట్ల మంది వినియోగదారులకు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత డిజిటల్ సేవలను ఆవిష్కరించింది. యోనో ప్లాట్‌ఫామ్ వేదికగా ఖాతాదారుల బ్యాంకింగ్ లావాదేవీలను మరింత సులభతరం చేసేందుకు, వ్యాపారాలను బలోపేతం చేసేందుకు, ఆర్థిక, పర్యావరణ శ్రేయస్సుకు ఇవి ఉపకరిస్తాయని పేర్కొంది.
3 ఇన్ 1 అకౌంట్: కొత్త వినియోగదారులు యోనో యాప్‌లో 3 ఇన్ 1 అకౌంట్ తెరవొచ్చు. పొదుపు ఖాతాతో పాటు, ఎస్‌బీఐక్యాప్ సెక్యూరిటీస్ ద్వారా డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలనూ ప్రారంభించొచ్చు. అర్హులైన ఖాతాదారులు తమ పొదుపు ఖాతాను కార్పొరేట్ వేతన ఖాతాగా మార్చుకోవచ్చు. వేతన ఖాతాను ఆన్‌లైన్‌లోనే అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.
బ్యాంకింగ్ రంగంలో తొలిసారిగా పర్యావరణ అనుకూల విధానాన్నీ యోనోలో ప్రవేశపెట్టింది. ఖాతాదారులు తమ డిజిటల్ లావాదేవీల వల్ల, ఎంత మేరకు కర్బన ఉద్గారాలు ఆదా అయ్యాయో తెలుసుకోవచ్చు.
బిజినెస్ బ్యాంకింగ్ విభాగంలో, పూర్తి స్థాయి ట్రేడ్ ఫైనాన్స్ సేవలను అనుసంధానించడం ద్వారా యోనో బిజినెస్‌లో ఇ-ట్రేడ్ సేవలను ఎస్‌బీఐ విస్తరించింది. ఉత్పత్తులు, ప్లాట్‌ఫామ్ ఫీచర్లు, సేవలకు సంబంధించిన సందేహాలపై తక్షణ మార్గదర్శకత్వం కోసం ‘యోనో జీ’ అనే ఏజెంటిక్ ఏఐ ఆధారిత వర్చువల్ అసిస్టెంట్‌ను ఎస్‌బీఐ తీసుకొచ్చింది.