దేశంలో మొదటి బుల్లెట్ రైలును మరో 15 నెలల్లో పాక్షికంగా పరుగులు పెట్టించేందుకు ‘నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్’ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్) సన్నాహాలు చేస్తోంది. ముంబయి - అహ్మదాబాద్ - సబర్మతి మధ్య చేపట్టిన ఈ ప్రాజెక్టులో వాపి - బిలిమోరా - సూరత్ మధ్య 98 కి.మీ. హైస్పీడ్ కారిడార్‌ను 2027 ఆగస్టుకు పూర్తి చేసి, అందుబాటులోకి తేవాలనేది ఈ సంస్థ లక్ష్యం.
2027 డిసెంబరు నాటికి వాపి నుంచి సబర్మతి వరకు 352 కి.మీ. హైస్పీడ్ కారిడార్ నిర్మాణాన్ని పూర్తి చేసే దిశగా పనులు జరుగుతున్నాయి. 2028 డిసెంబరు నాటికి థానే-సబర్మతి వరకు మొత్తం 492 కి.మీ., 2029 డిసెంబరు నాటికి ప్రారంభ స్థానమైన ముంబయి నుంచి చివరి స్టేషన్ సబర్మతి వరకు మొత్తం 508 కి.మీ. మార్గాన్ని అందుబాటులోకి తేవాలనేది ప్రణాళిక. అప్పటికి ఈ మార్గంలో మొత్తం 30 బుల్లెట్ రైళ్లు నడిపేందుకు రైల్వేశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది.