దిల్లీలో ప్రత్యేక ఈవీ పాలసీ

దిల్లీలో ప్రత్యేక ఈవీ పాలసీ

దేశ రాజధాని దిల్లీని 2030 నాటికి కాలుష్య రహిత నగరంగా మార్చాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా విద్యుత్‌ వాహనాలపై భారీగా పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలను ప్రకటించింది. దీంతోపాటు 2027 జనవరి నుంచి విద్యుత్‌ ఆటోలు, 2028 ఏప్రిల్‌ నుంచి విద్యుత్‌ ద్విచక్ర వాహనాలకే రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా నేతృత్వంలో సమావేశమైన కేబినెట్‌ ప్రత్యేక ఈవీ (విద్యుత్‌ వాహనాల) పాలసీకి ఆమోద ముద్ర వేసింది. కొత్త విధానంలో భాగంగా జులై 1 నుంచి రూ.30 లక్షల లోపు విద్యుత్‌ వాహనాలపై జీవితకాల పన్నును, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను ప్రభుత్వం ఎత్తివేస్తోంది. 

ఇవీ నిర్ణయాలు...

2030 మార్చి నాటికి దిల్లీలోని మొత్తం పాఠశాలల బస్సుల్లో 30శాతం విద్యుత్‌ వాహనాలుగా మారనున్నాయి.

30,000 ఈవీ ఛార్జింగ్‌ పాయింట్లు ఏర్పాటవుతాయి. ఈవీల మౌలిక వసతుల కోసం నాలుగేళ్లలో రూ.7,000 కోట్లు ఖర్చు చేస్తారు.

పాలసీ అమల్లోకి వచ్చిన తొలి ఏడాదిలో విద్యుత్‌ ద్విచక్ర వాహనం కొనుగోలు చేసేవారికి రూ.30,000 ప్రోత్సాహకం ఇస్తారు. రెండో ఏడాదిలో రూ.20,000, మూడో ఏడాది రూ.10,000 ఇస్తారు.

ఎలక్ట్రిక్‌ ఆటోలు కొనుగోలు చేసేవారికి తొలి ఏడాదిలో రూ.50,000, రెండో ఏడాదిలో రూ.40,000, మూడో ఏడాదిలో రూ.30,000 ప్రోత్సాహకంగా ఇస్తారు. 

ఎన్‌1 కేటగిరీ విద్యుత్‌ ట్రక్కులు కొనుగోలు చేస్తే రూ.లక్ష ప్రోత్సాహకంగా ఇస్తారు.

బీఎస్‌-4 వాహనాలను తుక్కుగా మార్చుకునేందుకు ముందుకు వచ్చే వారికి రూ.లక్ష ప్రోత్సాహకం

2027 జనవరి 1 నుంచి కేవలం విద్యుత్‌ ఆటోలకే రిజిస్ట్రేషన్‌. పెట్రోల్, సీఎన్‌జీ వాహనాలను అనుమతించబోరు.

2028 ఏప్రిల్‌ 1 నుంచి విద్యుత్‌ ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్లనే అనుమతిస్తారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram