హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్ స్టార్టప్ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేసిన ప్రైవేట్ ఆర్బిటల్ క్లాస్ రాకెట్ ‘విక్రమ్-1’ (మిషన్ ఆగమన్) ప్రయోగం విజయవంతమైంది. 2026, జులై 18న శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్)లోని మొదటి లాంచ్‌ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. అది నిర్దేశిత 450 కి.మీ. భూ దిగువ కక్ష్యలోకి ఆరు పేలోడ్లను కచ్చితత్వంతో ప్రవేశపెట్టింది. దీంతో ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ సామర్థ్యం ఉన్న ప్రపంచంలోని మూడో దేశంగా భారత్ రికార్డు సృష్టించింది.
విట్-ఏపీ విశ్వవిద్యాలయం విద్యార్థులు, అధ్యాపకులు డిజైన్ చేసిన పేలోడ్ ‘విశ్వ-ఎమ్’ (విట్ శాటిలైట్ వేవ్‌లెంగ్త్ ఎనాలసిస్ మాడ్యూల్)ను ‘విక్రమ్-1’ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపారు. ‘సోలారాస్’ నానో శాటిలైట్‌లో భాగంగా ఈ పేలోడ్‌ను రోదసిలోకి పంపించారు.