బ్రిటిష్ సామ్రాజ్యానికి కేంద్రబిందువుగా నిలిచిన బకింగ్‌హామ్ ప్యాలెస్ 200 ఏళ్ల చరిత్రలో తొలిసారి రాజు లేని రాజభవనంగా మారనుంది. సెంట్రల్ లండన్‌లో ఉన్న ఈ భవనాన్ని 1820 ప్రాంతంలో నిర్మించారు. 1837లో విక్టోరియా రాణి పరిపాలనా కాలం నుంచీ ఇది రాజప్రాసాదంగా వెలుగులీనుతోంది. రాజ కుటుంబంలో వివాహాలు జరిగినా, బ్రిటన్ ఎలాంటి విజయాలు సాధించినా ప్రజలు పెద్ద ఎత్తున బకింగ్‌హామ్ ప్యాలెస్ వద్ద గుమికూడి సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీ. మొత్తం 775 గదులున్న అత్యంత విలాసవంతమైన ఈ ప్యాలెస్‌కు 36.9 కోట్ల పౌండ్ల (రూ.4,591 కోట్లు) ఖర్చుతో 2017లో మరమ్మతులు ప్రారంభించారు. ఈ పనులు వచ్చే ఏడాది పూర్తి కానున్నాయి. ఆ తర్వాత బ్రిటన్ రాజు ఛార్లెస్-3 ఈ భవనంలోకి తన నివాసాన్ని మారుస్తారని అందరూ భావించగా, ఆయన ఆసక్తి చూపడం లేదు. ఈ నిర్ణయంతో బకింగ్‌హామ్ కేవలం రాజవంశ ప్రధాన కార్యాలయంగా, ప్రజలకు మరింతగా సందర్శనీయ సాంస్కృతిక కేంద్రంగా మిగిలిపోనుంది. ఈ ప్యాలెస్‌ను ఏటా 7 లక్షలమంది ప్రజలు సందర్శిస్తుంటారు.