పిడికెడంత గుండె నిలువెత్తు మనిషిని నడిపిస్తుంది. క్షణం ఆగకుండా నిరంతరం శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది. అవయవాల నుంచి వచ్చే చెడు రక్తాన్ని ఊపిరితిత్తుల్లోకి చేరవేసి, అక్కడ ఆక్సిజన్‌తో నిండిన మంచి రక్తాన్ని అవయవాలకు పంప్ చేస్తూ ప్రాణాలను నిలబెడుతోంది. జీవుల శరీరంలో ప్రధాన అవయవమైన గుండె, దాని విధులు, ఆవశ్యకతను చాటిచెప్పే లక్ష్యంతో ఏటా సెప్టెంబరు 29న ‘వరల్డ్ హార్ట్ డే’గా నిర్వహిస్తారు. హృదయ సంబంధ వ్యాధుల గురించి అవగాహన కల్పించడంతోపాటు వాటిని నివారించే మార్గాలను ప్రోత్సహించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం:
ప్రపంచవ్యాప్తంగా నానాటికీ పెరుగుతోన్న హృదయ సంబంధ వ్యాధులను నివారించే లక్ష్యంతో 1978లో జెనీవా కేంద్రంగా వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ (డబ్ల్యూహెచ్‌ఎఫ్) అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పడింది. మొదట్లో దీని పేరు ఇంటర్నేషనల్ సొసైటీ అండ్ ఫెడరేషన్ ఆఫ్ కార్డియాలజీగా ఉండేది. 1998లో దీన్ని డబ్ల్యూహెచ్‌ఎఫ్‌గా మార్చారు. ఇది ప్రపంచవ్యాప్తంగా 200 కంటే ఎక్కువ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)కు ముఖ్య భాగస్వామి కూడా.
ఆంటోని బేయస్ డి లూనా 1997 - 99లో డబ్ల్యూహెచ్‌ఎఫ్ అధ్యక్షుడిగా ఉన్నారు. డబ్ల్యూహెచ్‌ఓ సహకారంతో గుండె జబ్బుల నివారణపై ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రచారాన్ని రూపొందించాలని ఆయన భావించారు. ఇందులో భాగంగా ఏటా సెప్టెంబరులో వచ్చే చివరి ఆదివారం ‘వరల్డ్ హార్ట్ డే’గా జరుపుకోవాలని 1999లో ఆయన ప్రతిపాదించారు. 2000 నుంచి 2011 వరకు దీన్ని అదే రీతిలో నిర్వహించారు.
2012లో ‘వరల్డ్ హార్ట్ డే’ను ఏటా సెప్టెంబరు 29న నిర్వహించాలని డబ్ల్యూహెచ్‌ఓ తీర్మానించింది.
2025 నినాదం: “Don't Miss a Beat”