సౌర వ్యవస్థ ఏర్పడే క్రమంలో మిగిలిపోయిన అవశేషాలే తోకచుక్కలు (Comets). ఇవి నక్షత్రాలు కావు. ఘనీభవించిన మంచు, ధూళి, రాతితో కూడిన మంచు గోళాలుగా ఉంటాయి. తోకచుక్కలు సౌర వ్యవస్థ నుంచి చాలా దూరంలో అతి పెద్ద దీర్ఘవృత్తాకార వలయాల్లో పరిభ్రమిస్తాయి. సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు మాత్రమే వీటిని మనం కొంతకాలం పాటు చూడగలం. ఇవి సూర్యుడికి దూరంగా ఉన్నప్పుడు అతి శీతలంగా, చిన్న పరిమాణంలో ఉంటాయి. సూర్యుడికి సమీపంలోకి రాగానే అందులోని మంచు కరిగి, వాయువులు వ్యాకోచించి, చాలా పెద్దగా కనిపిస్తాయి.
కొన్ని ముఖ్యమైన తోకచుక్కలను పరిశీలిస్తే..
పేరు | మొదట గుర్తించింది | ప్రత్యేకత |
1. హేలీ | ఎడ్మండ్ హేలీ | ప్రతి 76 సంవత్సరాలకోసారి కనిపిస్తుంది. చివరగా 1986లో కనిపించింది. 2061లో మళ్లీ చూడొచ్చు. |
2. షూమేకర్ లెవి - 9 | కరోలిన్, షూమేకర్, డేవిడ్ లెవి (1993) | 1992లో బృహస్పతి గ్రహాన్ని ఢీకొట్టడం వల్ల 21 ముక్కలుగా విడిపోయి తనకు తానుగా వెలుగులోకి వచ్చింది. |
3. హయకుటాకే | యుజి హయకుటాకే (1996) | గత 200 సంవత్సరాల్లో భూమికి అత్యంత సమీపంలో ప్రయాణించిన తోకచుక్కగా ఇది గుర్తింపు పొందింది. |
4. హేల్-బాప్ | అలెన్ హేల్, థామస్ బాప్ (1995) | హేలీ తోకచుక్క కంటే పెద్దగా, ప్రకాశవంతంగా ఉంటుంది. |
5. టెంపుల్ - టటుల్ | టెంపుల్ (1865), టటుల్ (1866) | పరిమాణంలో చిన్నగా ఉంటుంది. దీని కక్ష్యావర్తన కాలం 33 సంవత్సరాలు. 1998లో సూర్యుడికి సమీపంగా వచ్చింది. 2031లో మళ్లీ చూడొచ్చు. |
6. బోరెల్లి | ఆల్ఫోన్స్ లూయీస్ నికోలస్ బోరెల్లి (1904) | సూర్యుడి చుట్టూ ఒకసారి భ్రమణానికి 6.9 ఏళ్లు పడుతుంది. చివరగా 2022లో కనిపించింది. మళ్లీ 2028లో చూడొచ్చు. |
7. ఎన్కే | పియరీ మెచైన్ (1786), జోహన్ ఫ్రాంజ్ ఎన్కే (1819) | ఇప్పటి వరకు గుర్తించిన తోక చుక్కల కంటే తక్కువ కక్ష్యా కాలాన్ని (3.30 ఏళ్లు) కలిగి ఉంది. |
8. వైల్డ్ 2 | పాల్ వైల్డ్ (1978) |
సూర్యుడి చుట్టూ ఒకసారి తిరిగేందుకు 6.41 ఏళ్లు పడుతుంది. |