చారిత్రక వైభవాన్ని పొందే క్రమంలో లేదా అభివృద్ధిలో భాగంగా కొన్ని ప్రాంతాలకు ఆయా ప్రభుత్వాలు పేర్లను మారుస్తుంటాయి. ఉదాహరణకు మన దేశంలో ఉత్తర్ ప్రదేశ్‌లో ప్రముఖ నగరమైన అలహాబాద్ పేరును ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రయాగరాజ్‌గా మార్చింది. ఆంధ్రప్రదేశ్‌లో రాజమండ్రికి గతంలో ఉన్న పేరే రాజమహేంద్రవరంగా మార్చారు. అధికారికంగా రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలని కేంద్ర ప్రభుత్తాన్ని కోరుతూ కేరళ శాసనసభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఇలా ఏదో ఒక కారణంగా పేరు మార్చుకున్న కొన్ని దేశాల గురించి పరిశీలిస్తే..!
సిలోన్ - శ్రీలంక
- దక్షిణాసియాలో హిందూ మహాసముద్రంలో ఉండే ఒక ద్వీపం శ్రీలంక. ఒకప్పుడు విజయ అనే రాజు పరిపాలించినప్పుడు ఈ ప్రాంతానికి ‘తంబపన్నీ’ అని పేరుండేది. రామాయణంలో ఈ ద్వీపాన్ని ‘లంక’గా పేర్కొన్నారు. తమిళ ప్రజలు ‘ఈలం’ అని పిలిచేవారు. క్రీ.శ. 993 తర్వాత కోలా వంశీయుల పరిపాలనలో ఈ దేశం ‘ముమ్ముడి కోలమండలం’గా ప్రాచుర్యంలోకి వచ్చింది.
- గ్రీక్ భౌగోళిక శాస్త్రవేత్తలు ఈ ప్రాంతాన్ని ‘టాప్రోబానా’గా.. పర్షియన్లు, అరబ్‌లు ‘సారాందాబ్’గా పిలిచారు. అప్పటి పోర్చుగీసు ప్రభుత్వం దీనికి ‘సిలోన్’ అని పేరు పెట్టింది. స్వాతంత్య్రం పొందిన తర్వాత 1972లో అప్పటి ప్రభుత్వం దేశం పేరును సిలోన్ నుంచి ‘శ్రీలంక’గా మార్చింది. సిలోన్ ఒక ఐలాండ్ (లంక) కాబట్టి.. దానికి శ్రీ అనే పదం జోడించి శ్రీలంకగా మార్పు చేసింది.
చెక్ రిపబ్లిక్ - చెకియా
- చెక్ రిపబ్లిక్ ప్రాంతానికి పెద్ద చరిత్రే ఉంది. ఈ ప్రాంతాన్ని మొదట్లో బోహెమియా అని పిలిచేవారు. స్లావిక్ తెగ నాయకుడు చెక్.. ఈ బోహెమియా దేశానికి ప్రజలతో వచ్చి ఇక్కడ స్థిరపడ్డాడు. ఈ తెగ మాట్లాడే భాషను కూడా చెక్ అనే అంటారు. ఈ దేశానికి అనేక పేర్లు ఉన్నాయి. చెక్/ బోహెమియన్ లాండ్స్, బోహెమియాన్ క్రౌన్, చెకియా, లాండ్స్ ఆఫ్ క్రౌన్ ఆఫ్ సెయింట్ వెన్సెస్లాస్ అని పిలిచేవారు.
- చెక్, స్లోవక్ జాతీయులు కలిసే ఉన్నారన్న సందేశం ఇవ్వడానికి దేశానికి ‘చెకోస్లోవేకియా’గా నామకరణం చేశారు. అయితే 1992లో చెకోస్లోవేకియా కూడా విడిపోవడంతో ‘చెక్ రిపబ్లిక్’ ఏర్పడింది. అయితే, అందరూ ఈ దేశాన్ని చెక్ రిపబ్లిక్ అని పిలుస్తున్నా, అక్కడి ప్రభుత్వం మాత్రం దేశానికి అధికారికంగా, సంక్షిప్త నామంగా ‘చెకియా’ పేరును ప్రతిపాదించింది.
స్వాజిలాండ్ - ఎష్వతిని
- స్వాజిలాండ్ ఆఫ్రికా ఖండంలోని ఓ దేశం. ఒకప్పుడు ఈ దేశం ఎష్వతిని రాజ్యంగా ఉండేది. స్వాజి తెగ ప్రజలు ఇక్కడ స్థిరపడటంతో స్వాజిలాండ్‌గా పిలుస్తున్నారు. అయితే 2018లో ప్రస్తుత స్వాజిలాండ్ చక్రవర్తి స్వాటి-III తమ దేశం పేరును తిరిగి ‘ఎష్వతిని’గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. స్వాజిలాండ్‌ను స్థానిక భాషలో ఎష్వతిని అంటారు.
బర్మా- మయన్మార్
- భారత్‌కు సమీపంలో ఉండే బర్మాను మయన్మార్ అని కూడా పిలుస్తారు. నిజానికి ఎప్పటినుంచో ఈ దేశానికి బర్మా అనే పేరుంది. ఇక్కడి బామర్ ప్రజలు మాట్లాడే భాష బర్మీస్/మైన్మ/బామా. దీంతో ఆ దేశాన్ని పిలవడంలో బర్మా/బామా అని, రాయడంలో మైన్మర్ అని వ్యవహరించేవారు. అలా బాహ్య ప్రపంచం ఈ దేశాన్ని బర్మా, మయన్మార్ రెండు పేర్లతోనూ పిలుస్తోంది.
- 1989లో అప్పటి ప్రభుత్వం స్థానిక భాషలో రాసిన పేరునే కొనసాగించాలని భావించి, దేశానికి ‘మయన్మార్’ పేరును అధికారికంగా ప్రకటించింది.
ముయాంగ్ థాయ్ - థాయ్‌లాండ్
- థాయ్‌లాండ్‌ను పూర్వం నుంచి స్థానిక ప్రజలు ముయాంగ్ థాయ్ అని పిలుచుకునేవారు. ఈ పదం పాళీ భాష లేదా సంస్కృతం లేదా మొన్ భాష నుంచి పుట్టిందని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే, 1939లో అప్పటి సియామ్ చక్రవర్తి దేశానికి ‘థాయ్ లాండ్’అని పేరు పెట్టారు.
- చైనా నుంచి స్వాతంత్ర్యం కోసం తొలిసారి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ థాయ్ ప్రజల గౌరవార్థం దేశానికి ‘థాయ్‌లాండ్’ అని పేరు పెట్టారట.
రిపబ్లిక్ ఆఫ్ జైర్ - కాంగో
- కాంగో దేశాన్ని ఒకప్పుడు ‘కాంగో ఫ్రీ స్టేట్’, ‘బెల్జియం కాంగో’, ‘కాంగో-లియోపొల్డివిల్లే’ అని పిలిచేవారు. దేశంలో కాంగో నది ఉంది.. 1960లో కాంగో బెల్జియం నుంచి స్వాతంత్య్రం పొందిన తర్వాత ‘రిపబ్లిక్ ఆఫ్ కాంగో’గా దేశానికి నామకరణం చేశారు. 1965 నుంచి 1971 మధ్య ఈ దేశాన్ని ‘డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో’గా మార్చారు.
- 1971లో అప్పటి దేశాధ్యక్షుడు మొబుటు సెసె సెకో దేశం పేరును ‘రిపబ్లిక్ ఆఫ్ జైర్’గా మార్చగా, అక్కడి నేషనల్ కాంగ్రెస్ పాత పేరు వైపే మొగ్గుచూపింది. దీంతో మళ్లీ దేశానికి ‘డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో’గా పేరు వచ్చింది.
ఖైమర్ రిపబ్లిక్ - కాంబోడియా
- కాంబోడియా దేశానికి అనేక సార్లు పేరు మార్పులు జరిగాయి. 14వ శతాబ్దం నుంచే యూరప్‌కు కాంబోడియా దేశం గురించి తెలుసు. ఈ పదాలు సంస్కృతంలోని ‘కాంబోజ్‌దేశ్’ అనే పదం నుంచి పుట్టుకొచ్చాయని చరిత్రకారుల అభిప్రాయం. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వ నిర్ణయాన్ని పక్కనపెట్టి తమ హయాం 1970-75 మధ్య దేశానికి ‘ఖైమర్ రిపబ్లిక్’గా నామకరణం చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కమ్యూనిస్టు ప్రభుత్వం 1975-79 వరకు కాంబోడియాను ‘డెమోక్రటిక్ కంపుచేయా’గా పేర్కొంది. అయితే, 1989 తర్వాత ఐక్యరాజ్యసమితి ఈ దేశానికి ‘స్టేట్ ఆఫ్ కాంబోడియా’గా పేరు పెట్టింది. అప్పుడు కాంబోడియాను ‘కింగ్‌డమ్ ఆఫ్ కాంబోడియా’గా మార్చారు.
- ప్రస్తుతం ఈ దేశాన్ని కాంబోడియా అంటున్నా, అక్కడి ప్రజలు మాత్రం కంపుచేయాగానే పిలుచుకుంటున్నారు.
టర్కీ - తుర్కియే
- ఈమధ్యకాలంలో పేరు మార్చుకున్న దేశం తుర్కియే. 2022లో ఐక్యరాజ్యసమితి ఆమోదంతో టర్కీ అని ఉన్న తమ దేశం పేరును తుర్కియేగా మార్చుకుంది.
- ఇలా పేరు మార్చుకోవడం వెనుక ఒక కారణం ఉంది. అదేంటంటే, టర్కీ అంటే ఫెయిల్యూర్, మూర్ఖుడు, సిల్లీఫెలో అని ఇంగ్లిష్‌లో అర్థం వస్తుంది. దీంతో తక్కువ చేసేలా ఉన్న పేరును మార్చుకోవాలని భావించారు. దీంతో తుర్కుల సంస్కృతి, సంప్రదాయాలు, నాగరికత, విలువలకు అద్దంపట్టేలా ఉన్న తుర్కియే పేరును ఖరారు చేసుకున్నారు.
పర్షియా- ఇరాన్
- ఇప్పుడు మనందరికీ తెలిసిన ఇరాన్‌ను గతంలో పర్షియా అని పిలిచేవారు. రెజా షా రాజు అయ్యాక పర్షియా పేరును ఇరాన్‌గా మార్చాడు.
- 1935 నుంచి పర్షియా దేశాన్ని ఇరాన్‌గా పిలుస్తున్నారు. కాకపోతే ఆ దేశంలో నివసించే ప్రజల్ని ఇప్పటికీ పర్షియన్లుగానే గుర్తిస్తారు.
- ఇవే కాదు.. ఒకప్పటి ట్రాన్స్‌జోర్డాన్‌ను జోర్డాన్‌గా, అబిస్సినియాను ఎథియోపియాగా, జర్మన్ సౌత్ వెస్ట్ ఆఫ్రికా పేరు నమీబియాగా మారాయి.