జమ్మూకశ్మీర్‌పై దశాబ్దాలుగా వివాదాన్ని రాజేస్తున్న పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత్‌పైకి ఉగ్రమూకలను ఉసిగొల్పుతోంది. ప్రతీకార దాడులతో మన దేశం బుద్ధి చెబుతున్నప్పటికీ దాయాది దేశం తీరు మారడంలేదు. గత ఏడు దశాబ్దాల్లో పాక్-భారత్ మధ్య చోటుచేసుకున్న కీలక సైనిక ఆపరేషన్లు..
మొదటి కశ్మీర్ యుద్ధం
- 1947లో స్వాతంత్ర్యం పొందిన కొన్ని నెలలకే భారత్-పాక్‌ల మధ్య మొదటి యుద్ధం జరిగింది. దీన్నే ‘మొదటి కశ్మీర్ యుద్ధం’ అని పిలుస్తారు. జమ్మూకశ్మీర్ కోసం ఈ యుద్ధం జరిగింది. కశ్మీర్ రాజైన మహారాజా హరిసింగ్ భారత్‌కు స్వాతంత్య్రం వచ్చాక జమ్మూకశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాంత పరిరక్షణ కోసం భారత్ తమ సాయుధ దళాలను రంగంలో దింపింది.
- 1947 అక్టోబరులో పాకిస్థాన్ మద్దతున్న గిరిజన మిలీషియాలు జమ్మూకశ్మీర్‌పై దాడి చేయడంతో ఈ యుద్ధం అనివార్యమైంది. 1948 వరకు ఇది కొనసాగింది.
- ఐక్యరాజ్యసమితి జోక్యంతో ఇరు దేశాలూ 1949 జనవరిలో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. జమ్మూకశ్మీర్‌లో మూడింట రెండొంతుల భూభాగం భారత్ స్వాధీనం చేసుకోగా.. మిగతా భాగం పాక్ నియంత్రణలో ఉండిపోయింది. దాన్నే పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)గా పేర్కొంటున్నాం. దాని ఫలితంగానే నియంత్రణ రేఖ (లైన్ ఆఫ్ కంట్రోల్-ఎల్‌వోసీ) ఏర్పాటైంది.
రెండో ఇండో-పాక్ యుద్ధం
- 1965లో భారత్, పాకిస్థాన్ మధ్య మళ్లీ యుద్ధం జరిగింది. ఆగస్టు 5న స్థానిక తిరుగుబాటుదారుల వేషంలో వేలమంది పాక్ సైనికులు జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి భారత భూభాగంలోకి చొరబడ్డారు. ‘‘ఆపరేషన్ జిబ్రాల్టర్’’ పేరుతో రహస్య ఆపరేషన్ నిర్వహించేందుకు పాక్ ప్రయత్నించి విఫలమైంది. జమ్మూకశ్మీర్‌ను అస్థిరపరచడం, స్థానిక తిరుగుబాట్లను రెచ్చగొట్టడం లక్ష్యంగా పెట్టుకుంది. భారత్ ప్రతిస్పందనతో పాక్ తోకముడిచింది. ఈ యుద్ధం 1965 సెప్టెంబరు 23 వరకు కొనసాగింది. ఆ తర్వాత సోవియట్ యూనియన్, అమెరికా మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి.
బంగ్లాదేశ్ విమోచన యుద్ధం
- స్వాతంత్య్రం కోసం ఉద్యమించిన తూర్పు పాకిస్థాన్ (బంగ్లాదేశ్)పై పశ్చిమ పాకిస్థాన్ చేపట్టిన క్రూర అణచివేత 1971లో భారత్-పాక్‌ల మధ్య మూడో యుద్ధానికి దారితీసింది. బెంగాలీ భాష మాట్లాడే తూర్పు పాకిస్థాన్ వాసులు పశ్చిమ పాకిస్థాన్ నుంచి స్వాతంత్య్రం కోరుతూ చేసిన ఉద్యమానికి భారత్ మద్దతు పలికింది. యుద్ధంలో భారత్ తిరుగులేని విజయం సాధించింది.
- 1971 డిసెంబరు 4న కరాచీ నౌకాశ్రయం లక్ష్యంగా భారత నౌకాదళం ‘ఆపరేషన్ ట్రైడెంట్’ చేపట్టింది. తూర్పు, పశ్చిమ సరిహద్దుల్లో తీవ్రమైన పోరాటం తర్వాత పాకిస్థాన్ దళాలు 1971 డిసెంబరు 16న భారత్‌కు లొంగిపోయాయి. ఫలితంగా పాకిస్థాన్ రెండు ముక్కలై బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది.
ఆపరేషన్ మేఘ్‌దూత్
- లద్దాఖ్‌లోని సియాచిన్ గ్లేసియర్‌లో కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకునేందుకు 1984లో ‘ఆపరేషన్ మేఘ్‌దూత్’ను భారత్ చేపట్టింది.
- సాల్టోరో రిట్జ్‌పై పైచేయి సాధించిన భారత బలగాలు ఆ ప్రాంతంలో శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేశాయి. అత్యంత ఎత్తైన ప్రదేశంలోని ఆ యుద్ధభూమి భారత్‌కు ఓ వ్యూహాత్మక కేంద్రంగా మారింది. ఇప్పటికీ అక్కడ మన బలగాల గస్తీ ఉంటుంది.
కార్గిల్ యుద్ధం
- 1999లో భారత్- పాకిస్థాన్‌ల మధ్య కార్గిల్ యుద్ధం ఎత్తైన పర్వత ప్రాంతాల్లో సాగింది. జమ్మూకశ్మీర్‌లోని కార్గిల్ సెక్టార్‌లో పర్వత ప్రాంతాలను పాకిస్థాన్ దళాలు, ఉగ్రవాదులు ఆక్రమించడంతో ఈ యుద్ధం అనివార్యమైంది. ఈ క్రమంలో ‘‘ఆపరేషన్ విజయ్’’ పేరుతో సైన్యం సాగించిన పోరాటానికి భారత వైమానిక దళం ‘‘ఆపరేషన్ సఫేద్ సాగర్’’ పేరుతో సహకారం అందించింది.
- పాక్ సైన్యాన్ని, ఉగ్రవాదులను తరిమికొట్టిన భారత్ ఈ యుద్ధంలో విజయం సాధించింది. 1999 మేలో ప్రారంభమైన ఈ యుద్ధం జులై వరకు జరిగింది. ఏటా జులై 26న ‘‘కార్గిల్ విజయ్ దివస్’’ పాటిస్తారు.
కార్గిల్‌లో ‘ఆపరేషన్ విజయ్’
- జమ్మూకశ్మీర్ కార్గిల్ సెక్టార్‌లో పాక్‌సైన్యం అక్రమంగా చొరబడింది. దీంతో భారత్ ఆపరేషన్ విజయ్ ను చేపట్టింది. భారత్ వాయుసేన కూడా సైన్యానికి తోడ్పాటు అందించింది. భీకర యుద్ధంలో పైచేయి సాధించిన భారత్ జులై నాటికి ఆ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. అందుకే జులై 26ను కార్గిల్ విజయ్ దివస్‌గా నిర్వహించుకుంటున్నాం.
ఉరీ దాడి
- పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదులు 2016 సెప్టెంబరు 18న జమ్మూకశ్మీర్ ఉరీ ప్రాంతంలో భారత సైనిక స్థావరంపై దాడులు జరిపారు. దీనిలో 19 మంది సైనికులు మరణించారు.
- సెప్టెంబరు 28, 29న నియంత్రణ రేఖ వెంబడి భారత్ మెరుపు దాడి (సర్జికల్ స్ట్రైక్) నిర్వహించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాదుల శిబిరాలు, తండాలను లక్ష్యంగా చేసుకుంది. చొరబాట్లకు సిద్ధమవుతున్న ముష్కరులను మట్టుబెట్టింది. భారీసంఖ్యలో ఉగ్రవాదులు మరణించారు.
బాలాకోట్
- 2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బంది మరణించారు. ఈ దాడులు చేసినట్లు జైషే మహమ్మద్ ప్రకటించుకుంది. ప్రతిస్పందనగా భారత వాయుసేన పాకిస్థాన్‌లోని బాలాకోట్ ప్రాంతంలో జైషే మొహమ్మద్ ఉగ్రవాద శిక్షణా శిబిరంపై అదే నెల 26న వైమానిక దాడులు చేసింది. ఫైటర్ జెట్‌లతో పాక్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరం లక్ష్యంగా ఈ దాడి జరిగింది. 1971 యుద్ధం తర్వాత పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లి దాడులు చేయడం అదే తొలిసారి.
ఆపరేషన్ సిందూర్
- పహల్గాంలో ఏప్రిల్ 22న పర్యటకులపై దాడి చేసిన ఉగ్రవాదులు 26 మందిని ఊచకోత కోశారు. దీనికి ప్రతీకారంగా పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని జైషే మహమ్మద్, లష్కరే తయ్యిబా ఉగ్రస్థావరాలపై భారత సైన్యం 2025 మే 7న ‘ఆపరేషన్ సిందూర్’ అనే పేరుతో దాడులు నిర్వహించింది. మొత్తం 9 ఉగ్రస్థావరాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసి వాటిని ధ్వంసం చేసింది.