భారతదేశంలో న్యాయవ్యవస్థను ప్రవేశపెట్టింది గవర్నర్ జనరల్ ‘వారెన్ హేస్టింగ్స్’. దాన్ని అభివృద్ధిపరచి న్యాయవ్యవస్థ పితామహుడిగా పేరుగాంచింది కారన్ వాలీస్. ఇతడు న్యాయవ్యవస్థలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి, ‘కారన్ వాలీస్ కోడ్’ అనే న్యాయ నియమావళిని ప్రవేశపెట్టాడు. కలకత్తా, ఢాకా, ముర్షిదాబాద్, పట్నాల్లో ‘సర్క్యూట్ కోర్టులు’ ఏర్పాటు చేశాడు.
- భారత్‌లో తొలి సుప్రీంకోర్టును ఈస్టిండియా కంపెనీ ఏర్పాటు చేసింది. ‘రెగ్యులేటింగ్ చట్టం - 1773’ ప్రకారం 1774, మార్చి 16న కలకత్తాలోని ఫోర్ట్ విలియంలో మొదట సుప్రీంకోర్టు ప్రారంభమైంది. అందులో ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు ఇతర న్యాయమూర్తులు ఉన్నారు. తొలి ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంఫే. ఇతర న్యాయమూర్తులు సీజర్ లైమెస్టర్, జాన్‌హైడ్, రాబర్ట్ చాంబర్స్.
- ‘భారత ప్రభుత్వ చట్టం 1935’ ప్రకారం కలకత్తాలోని సుప్రీంకోర్టును ‘ఫెడరల్ కోర్టు’గా మార్పు చేసి 1937లో దిల్లీలో ఏర్పాటు చేశారు. ఈ ఫెడరల్ కోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి సర్ మారిస్ గ్వేయర్. ఫెడరల్ కోర్టు తీర్పులను బ్రిటన్‌లో ఉన్న ‘ప్రివీ కౌన్సిల్’లో అప్పీలు చేసుకునే అవకాశం కల్పించారు. 1937 నుంచి 1950 మధ్యకాలంలో ‘ఫెడరల్ కోర్టు’ పార్లమెంటు భవనంలో ఉన్న ‘ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్’ కేంద్రంగా కార్యకలాపాలను కొనసాగించింది.
- స్వాతంత్య్రానంతరం ‘ఫెడరల్ కోర్టు’ 1950, జనవరి 28 నుంచి సుప్రీంకోర్టుగా మారింది. ఇందులో ఒక ప్రధాన న్యాయమూర్తి, ఏడుగురు ఇతర న్యాయమూర్తులు ఉన్నారు. తొలి ప్రధాన న్యాయమూర్తి ‘హరిలాల్ జె కానియా’.
రాజ్యాంగ వివరణ
- రాజ్యాంగం 5వ భాగంలోని ఆర్టికల్స్ 124 నుంచి 147 మధ్య సుప్రీంకోర్టు నిర్మాణం, న్యాయమూర్తుల అర్హతలు, నియామక విధానం, ప్రమాణస్వీకారం, జీతభత్యాలు, తొలగింపు ప్రక్రియ, అధికారాలు, విధుల గురించి వివరణ ఉంది.
- ఆర్టికల్ 124: సుప్రీంకోర్టు ఏర్పాటు, నిర్మాణం గురించి వివరిస్తుంది.
- ఆర్టికల్ 124 (1): సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు ఉంటారు. పార్లమెంటు చట్టం ద్వారా ఈ న్యాయమూర్తుల సంఖ్య నిర్ణయమవుతుంది. మొదటిసారి 1950లో చేసిన చట్టం ప్రకారం 1 + 7, ఏడోసారి 2019 నాటి చట్టం ప్రకారం ప్రస్తుతం 1 + 33 ప్రధాన, ఇతర న్యాయమూర్తులు ఉన్నారు.
- ఆర్టికల్ 124(2): న్యాయమూర్తుల నియామక విధానం గురించి వివరిస్తుంది. ప్రధానమంత్రి నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ సిఫార్సుల మేరకు భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమిస్తారు.