సౌరకుటుంబంలో వాతావరణంతో కూడిన జలావరణం ఒక్క భూమిపైనే ఉంది. భూ ఉపరితలం మొత్తం వైశాల్యం దాదాపు 510 మి.చ.కి.మీ. ఇందులో భూగోళం మీద 148 మి.చ.కి.మీ. నేల, 361 మి.చ.కి.మీ. జల భాగం ఆక్రమించి ఉన్నాయి. అంటే భూమి ఉపరితలంలో 70.9% నీరు ఆవరించగా, మిగిలిన 29.1% మాత్రమే భూభాగం ఉంది.
భూమిపై ఉన్న జలావరణంలో 97.22% ఉప్పు నీరే. ఇది మహాసముద్రాలు, సముద్రాల్లో ఉంది. మిగిలిన 2.78% మంచినీరు. ఇందులోనూ 69.56% మంచు రూపంలో, 30.1% భూగర్భ జలరూపంలో ఉండగా చెరువులు, నదులు, సరస్సుల రూపంలో మనుషులు వినియోగించుకునేది 0.34% మాత్రమే.
భూమి ఉత్తరార్ధగోళ విస్తీర్ణంలో 61%, దక్షిణార్ధగోళ విస్తీర్ణంలో 81% మహాసముద్రాలు ఆక్రమించి ఉన్నాయి.
జలసంధి:
రెండు పెద్ద భూభాగాలను వేరు చేసే సన్నటి జలభాగాన్ని లేదా రెండు పెద్ద జల భాగాలను కలిపే సన్నని జలభాగాన్ని జలసంధి అంటారు. ఇవి నౌకల రవాణాకు ముఖ్యమైనవిగా ఉంటాయి.
వివిధ ముఖ్యమైన జలసంధులు - అవి కలిపే జలభాగాలు, వేరుచేసే భూభాగాలను పరిశీలిస్తే..
జలసంధి | కలిపే జలభాగాలు | వేరుచేసే భూభాగాలు |
జిబ్రాల్టర్ జలసంధి | అట్లాంటిక్, మధ్యధరా | ఆఫ్రికా, ఐరోపా |
బేరింగ్ జలసంధి | ఆర్కిటిక్, పసిఫిక్ | ఆసియా, ఉత్తర అమెరికా |
హార్ముజ్ జలసంధి | అరేబియా సముద్రం, పర్షియా సింధుశాఖ | అరేబియా, ఇరాన్ |
మలక్కా జలసంధి | అండమాన్ సముద్రం, దక్షిణ చైనా సముద్రం | ఇండోనేసియా, మలేసియా |
పాక్ జలసంధి | పాక్ అఖాతం, బంగాళాఖాతం | భారత్, శ్రీలంక |
బాబ్-ఎల్-మండేబ్ | ఎర్రసముద్రం, ఏడెన్ సింధుశాఖ | అరేబియా ద్వీపకల్పం, ఆఫ్రికా |
డార్టెనెల్లిస్ జలసంధి | మార్మారా సముద్రం, ఏజియన్ సముద్రం | ఐరోపా, ఆసియా |
ఫార్మోసా జలసంధి | దక్షిణ చైనా సముద్రం | చైనా, తైవాన్ |