లోక్‌సభ స్పీకర్‌

లోక్‌సభ స్పీకర్‌

భారత ప్రజాస్వామ్యానికి మూలస్తంభం లోక్‌సభ. ఇది పార్లమెంట్‌లో దిగువ సభ. ప్రజల ద్వారా ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికైన వ్యక్తులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ప్రజా సంక్షేమం, దేశాభివృద్ధే ధ్యేయంగా లోక్‌సభలో శాసనాల రూపకల్పన జరుగుతుంది. ఇది భారత జాతికి ప్రతిబింబంగా ఉంటుంది. ఇంతటి విశిష్టత కలిగిన లోక్‌సభకు స్పీకర్‌ అధ్యక్షత వహిస్తారు. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న ఓం బిర్లాను తొలగించే తీర్మానాన్ని ప్రవేశపెట్టాలంటూ కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్ష ఎంపీలు 2026, ఫిబ్రవరి 10న లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ ఉత్పల్‌ కుమార్‌ సింగ్‌కు నోటీసు ఇచ్చారు. ఈ నేపథ్యంలో పోటీపరీక్షల కోణంలో ‘లోక్‌సభ స్పీకర్‌’కు సంబంధించిన ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం..!

ఎన్నిక ఇలా..

  • స్పీకర్‌గా ఎన్నికవడానికి నిర్దిష్ట అర్హతలు ఏవీ మన రాజ్యాంగంలో పేర్కొనలేదు. లోక్‌సభ ఎన్నికల అనంతరం మొదటి సమావేశంలోనే సభ్యుల్లో ఒకరిని స్పీకర్‌గా ఎన్నుకుంటారు.
  • స్పీకర్‌ ఎన్నిక తేదీని రాష్ట్రపతి నిర్ణయిస్తారు. డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక తేదీని స్పీకర్‌ నిర్ణయిస్తారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ పదవీ ప్రమాణ స్వీకారం అనేది ప్రత్యేకంగా ఉండదు.
  • లోక్‌సభ రద్దయినప్పటికీ తిరిగి లోక్‌సభ ఏర్పడేంతవరకూ స్పీకర్‌ పదవిలో కొనసాగుతారు.
  • లోక్‌సభ సభ్యులు ఎవరైనా స్పీకర్‌ పదవికి పోటీ చేయొచ్చు. ఒకటే నామినేషన్‌ వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఓటింగ్‌ లేకుండా స్పీకర్‌ అవుతారు. సాధారణంగా అధికార పక్షానికి చెందిన వ్యక్తే ఈ పదవిలో ఉంటారు.  

అభిశంసన నోటీసు ఇలా..

  • స్పీకర్‌ తొలగింపునకు తీర్మానం ప్రవేశపెట్టాలంటే నోటీసుపై కనీసం ఇద్దరు లోక్‌సభ సభ్యులు సంతకం చేయాలి. సాధారణ ఆధిక్యంతో సభ ఆమోదిస్తే సరిపోతుంది. దీనికోసం సభలో ప్రస్తుతం ఉన్న సభ్యులందరినీ లెక్కిస్తారు. ఖాళీలు మినహాయించి మిగిలిన సభ్యులంతా లెక్కలోకి వస్తారు.
  • నోటీసును ఉపసభాపతికి కాకుండా సెక్రటరీ జనరల్‌కే సమర్పించాలి.
  • ప్రతిపాదిత తీర్మానంలో పరువుకు నష్టం కలిగించే భాష, ఇతర అంశాలు ఉండకూడదు. తీర్మానంలో వాడిన భాషను సాధారణంగా డిప్యూటీ స్పీకర్‌ పరిశీలిస్తారు. లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్‌ లేకపోతే ప్యానెల్‌ ఛైర్‌పర్సన్‌లలో అత్యంత సీనియర్‌ సభ్యుడు దీన్ని పరిశీలిస్తారు.
  • తీర్మానం ప్రవేశపెట్టడానికి కనీసం 14 రోజుల ముందే నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. తీర్మానం పరిగణనలో ఉన్న సమయంలో సభకు స్పీకర్‌ నేతృత్వం వహించే అవకాశం లేదు. తీర్మానాన్ని అనుమతించేందుకు  50 మంది సభ్యుల మద్దతు అవసరం. అన్నిపక్షాల నేతలతో మాట్లాడిన అనంతరం, నిబంధనలకు అనుగుణంగా తగిన సమయంలో చర్చకు తేదీని ప్రకటిస్తారు. తీర్మానం ప్రవేశపెట్టిన 10 రోజుల్లోగా దీనిపై చర్చించి, తేల్చాల్సి ఉంటుంది. 

లోక్‌సభ స్పీకర్‌ పూర్తి సమాచారం ఈబుక్‌ రూపంలో ఈనాడు ఈప్రతిభ వాట్సాప్‌ ఛానెల్‌లో అందుబాటులో ఉంది. వెంటనే ఫాలో చేసి, పోటీ పరీక్షలకు ఉపయోగపడే సమాచారాన్ని ప్రతి రోజూ ఉచితంగా అందుకోండి.https://hov.to/e05e8f1a

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. లోక్‌సభకు తొలి మహిళా స్పీకర్‌ ఎవరు?

(ఐబీ సెక్యూరిటీ అసిస్టెంట్‌ అండ్‌ ఎంటీఎస్, 2019)

1) సుమిత్రా మహాజన్‌       2) నజ్మా హెఫ్తుల్లా

3) మీరా కుమార్‌          4) ప్రతిభా పాటిల్‌

సమాధానం: 3

2. లోక్‌సభ స్పీకర్‌ను కింది ఎవరు ఎన్నుకుంటారు?

(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ సీబీటీ-1, 2021)

1) భారత రాష్ట్రపతి                 2) లోక్‌సభ సభ్యులందరూ

3) లోక్‌సభలోని మెజారిటీ పార్టీ సభ్యులు   4) పార్లమెంట్‌ సభ్యులందరూ

సమాధానం: 2

3. కిందివారిలో ఎవరు ప్రమాణస్వీకారం చేయరు?  

(సీజీపీఎస్సీ సివిల్‌ సర్వీస్, 2017)

1) రాష్ట్రపతి         2) ఉపరాష్ట్రపతి

3) స్పీకర్‌           4) ప్రధానమంత్రి    5) మంత్రిమండలి సభ్యులు

సమాధానం: 3

 

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram