జీవరాశి మనుగడకు సురక్షితమైన పర్యావరణం అత్యంత అవసరం. మంచి వాతావరణంలోనే ఏ సమాజమైనా అభివృద్ధి సాధిస్తుంది. భూమిపై ఉన్న సమస్త జీవరాశిలో ఒక్క మానవుడికి మాత్రమే ప్రకృతి వనరులను వివిధ రూపాల్లో వినియోగించుకునే సామర్థ్యం ఉంది. అయితే ప్రగతి పేరుతో మనిషి విచక్షణారహితంగా చేసే పనులు విధ్వంసాన్ని సృష్టించి, విపత్తులకు కారణమవుతున్నాయి. దీంతో ఆవరణ వ్యవస్థలకు నష్టం వాటిల్లి, మొత్తం జీవకోటి మనుగడే ప్రమాదంలో పడుతోంది. దీన్ని అధిగమించి ప్రాణుల ఆరోగ్యం, పర్యావరణం మధ్య ఉన్న కీలక సంబంధాల గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా సెప్టెంబరు 26న ‘ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం’గా (World Environmental Health Day) నిర్వహిస్తారు. ప్రజా శ్రేయస్సు అనేది పరిసరాల నాణ్యతతో ముడిపడి ఉందని తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం:
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యావరణ నిపుణులను ఏకం చేసే లక్ష్యంతో లండన్ కేంద్రంగా 1986లో ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ (ఐఎఫ్‌ఈహెచ్) అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పడింది. పర్యావరణాన్ని రక్షించడం ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడొచ్చని ఇది ప్రచారం చేసేది.
దీనికి విస్తృత ప్రాచుర్యం కల్పించడంతోపాటు పర్యావరణ రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజల్లో అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో ఏటా సెప్టెంబరు 26న ‘ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం’గా జరుపుకోవాలని 2011లో ఈ సంస్థ తీర్మానించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహిస్తున్నారు.
2025 నినాదం: "Clean Air, Healthy People"