జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) ప్రారంభానికి గుర్తుగా ఏటా సెప్టెంబరు 24న ‘జాతీయ సేవా పథకం’ (National Service Scheme - NSS Day) దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు తమ పాఠ్యాంశాలతోపాటు సమాజ సేవలో పాల్గొనేలా ప్రోత్సహించే కార్యక్రమమే ఎన్‌సీసీ. వ్యక్తులతో మంచి సంబంధాలను పెంపొందించుకోవడం, సమాజ శ్రేయస్సు పట్ల బాధ్యతగా వ్యవహరించడం లాంటి వాటిపై ఇది దృష్టి సారిస్తుంది. ఎన్‌ఎస్‌ఎస్ అనేది ప్రధానంగా వ్యక్తిత్వ వికాసాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రారంభమైంది. విద్యార్థులను దేశసేవలో భాగస్వాములను చేయడం దీని ప్రధాన ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) విద్యా సంస్థల్లోని విద్యార్థులు స్వచ్ఛంద జాతీయ సేవ చేసేలా ప్రోత్సహించాలని కేంద్రానికి సూచించింది. 1958లో నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ యూజీసీ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. దీనిపై ఒక నిర్దిష్ట ప్రణాళికను రూపొందించాల్సిందిగా ఆయా రాష్ట్రాల విద్యా మంత్రిత్వ శాఖలను ఆయన కోరారు.
జాతీయ సేవా పథకాన్ని (ఎన్‌ఎస్‌ఎస్) 1969, సెప్టెంబరు 24న నాటి కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ వీకేఆర్‌వీ రావు ప్రారంభించారు. ఆ సమయంలో దేశంలోని 37 విశ్వవిద్యాలయాల్లో దీన్ని అమలు చేశారు. మొత్తం 40 వేల మంది వాలంటీర్లుగా నమోదయ్యారు.
జాతీయ సేవా పథకం ఏర్పాటు సూచికగా ఏటా సెప్టెంబరు 24న ఎన్‌ఎస్‌ఎస్ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.