ఎక్కువ మంది ప్రజల ఆమోదం పొంది, ఆచరిస్తున్న ప్రభుత్వ ఏర్పాటు విధానమే ప్రజాస్వామ్యం.
అందరూ సమానం, అందరికీ స్వాతంత్య్రం అనేవి ఇందులో ప్రధాన నియమాలు. ఇందులో పాలకులు, పాలితులు రెండూ ప్రజలే. నిర్ణయాధికారం వారికే ఉంటుంది.
ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో అధిక సంఖ్యాక ప్రజలకు అధికారంలో భాగస్వామ్యం ఉంటుంది.
ప్రజల స్వాతంత్య్రం, సమానత్వం, న్యాయాలకు హామీ ఉంటుంది. ఇంతటి విశిష్ట ప్రజాస్వామ్య విలువల గురించి ప్రజలందరికీ తెలియజేసే లక్ష్యంతో ఏటా సెప్టెంబరు 15న ‘అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం’గా (International Day of Democracy) నిర్వహిస్తారు.
ప్రజాస్వామ్య పాలన, మానవ హక్కులు, చట్టాల ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం:
1997, సెప్టెంబరు 11 నుంచి 15వరకు ఈజిప్టులోని కైరోలో ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ (ఐపీయూ) 98వ సమావేశం జరిగింది.
ఇందులో చివరి రోజున ప్రజాస్వామ్యం, దాన్ని అనుసరించాల్సిన ప్రాముఖ్యతపై ఒక సార్వత్రిక ప్రకటనను వెలువరించారు.
అప్పటికే ఊపందుకున్న ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ హక్కులు, ఉపధిపై తీర్మానాలను ఆమోదించారు. ఇది ముఖ్యంగా ప్రజాస్వామ్య సూత్రాలు, ప్రమాణాలను నిర్వచించే మైలురాయిగా పేరొందింది.
ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంతోపాటు అన్ని దేశాలూ ప్రాజాస్వామ్య పాలనను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఐక్యరాజ్యసమంతి జనరల్ అసెంబ్లీ ఏటా సెప్టెంబరు 15న ‘అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం’గా జరుపుకోవాలని 2007లో తీన్మానించింది. 2008 నుంచి ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహిస్తున్నారు.
2025 నినాదం: Achieving gender equality, action by action