ప్రపంచవ్యాప్తంగా హింసను అరికట్టి, సమాజంలో శాంతియుత పరిస్థితులను పెంపొందించే లక్ష్యంతో ఏటా సెప్టెంబరు 21న ‘అంతర్జాతీయ శాంతి దినోత్సవం’గా (International Day of Peace) నిర్వహిస్తారు.
దీన్నే ప్రపంచ శాంతి దినోత్సవం (World Peace Day) అని కూడా అంటారు. శాంతి ద్వారానే దేశ ప్రగతి సాధ్యం. శాంతి అంటే సంఘర్షణ లేకపోవడం మాత్రమే కాదు.
పరస్పర అవగాహన, సహకార స్ఫూర్తితో విభేదాలను పరిష్కరించుకోవడం, మంచి భాగస్వామ్య ప్రక్రియలు మొదలైనవన్నీ ఇందులో భాగం. ప్రధానంగా ఇది హక్కులను పరిరక్షిస్తూ, మానవ సంబంధాల బలోపేతంపై దృష్టి సారిస్తుంది.
విద్య ద్వారా హింస వల్ల కలిగే నష్టాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు సామరస్యం, పరస్పర గౌరవం ఆవశ్యకతను తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం:
ప్రపంచవ్యాప్తంగా శాంతిని ప్రోత్సహించే ఉద్దేశంతో 1981లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఏటా సెప్టెంబరులో వచ్చే మూడో మంగళవారంనాడు ‘అంతర్జాతీయ శాంతి దినోత్సవం’గా జరుపుకోవాలని తీర్మానించింది. 1982 నుంచి దీన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. హింసకు తావులేకుండా వివాదాలను పరిష్కరించడం దీని లక్ష్యమని యూఎన్‌ఓ పేర్కొంది.
ఈ దినోత్సవాన్ని ఏటా సెప్టెంబరు 21న జరుపుకోవాలని 2001లో నిర్ణయించారు.
2025 నినాదం: Act Now for a Peaceful World