వెదురు వల్ల కలిగే ప్రయోజనాలను వివరించే లక్ష్యంతో ఏటా సెప్టెంబరు 18న ‘ప్రపంచ వెదురు దినోత్సవం’గా (World Bamboo Day) నిర్వహిస్తారు. వెదురు ప్రపంచంలోని అత్యంత స్థిరమైన మొక్కల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. రాళ్ల నేలలు, బీడు భూములు సహా ఎలాంటి ప్రాంతాల్లోనైనా ఇవి సులువుగా పెరుగుతాయి. వీటిని తక్కువ నీటి పారుదల సౌకర్యంతో ఎరువులు, పురుగుమందుల అవసరం లేకుండానే సాగు చేయొచ్చు. మనం రోజువారీ ఉపయోంచే పాలిథిన్, ప్లాస్టిక్ వస్తువుల స్థానంలో వెదురుతో చేసిన ఉత్పత్తులను వినియోగించడం వల్ల పర్యావరణాన్ని రక్షించవచ్చు. అంతేకాకుండా వీటిసాగు ద్వారా ఆదాయాన్ని పొందొచ్చు. వెదురు వాడకంతో ఆర్థిక వ్యవస్థకు, పర్యావరణానికి, సమాజానికి కలిగే మంచి ఫలితాలను ప్రజలకు తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం:
ప్రపంచ వెదురు సంస్థ (డబ్ల్యూబీఓ) ఆధ్వర్యంలో 2009లో బ్యాంకాక్‌లో ప్రపంచ వెదురు కాంగ్రెస్ ఎనిమిదో సభ జరిగింది. దీనికి సుమారు 100 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. వెదురు ద్వారా లభించే ఆర్థిక ప్రయోజనాలు, వాటి సాగు వల్ల పర్యావరణానికి, సమాజానికి కలిగే లాభాలపై ఇందులో చర్చించారు.