హైదరాబాద్‌ విలీన దినోత్సవం

హైదరాబాద్‌ విలీన దినోత్సవం

భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక కూడా హైదరాబాద్‌ సంస్థానం 13 నెలల పాటు నిజాం పాలనలోనే ఉంది. ఆ సమయంలో ఇక్కడ అనేక అరాచకాలు ప్రజ్వరిల్లాయి. మానవ హక్కులు పూర్తిగా నశించాయి. మతతత్వం రాజ్యమేలింది. రజాకార్లు అడ్డూ అదుపు లేకుండా తమ అకృత్యాలను సాగించారు. ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో రాజ్యంలో శాంతిస్థాపన కోసం భారత ప్రభుత్వం పోలీస్‌ చర్య చేపట్టింది. ఫలితంగా 1948 సెప్టెంబరు 17న హైదరాబాద్‌ సంస్థానం భారత్‌లో విలీనమైంది.

స్వాతంత్య్రానంతర పరిస్థితులు..

1947 స్వాతంత్య్ర చట్టం ప్రకారం ఆగస్టు 15న భారత్‌కు స్వరాజ్యం లభించింది. ఈ చట్టం దేశంలోని స్వదేశీ సంస్థానాలు లేదా రాజ్యాలు తమ ఇష్టానుసారం స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగడం లేదా భారత్‌/ పాకిస్థాన్‌లో విలీనమయ్యే స్వేచ్ఛను కల్పించింది. నాటి భారత ఉపప్రధాని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ కృషి ఫలితంగా దేశంలోని మొత్తం 562 స్వదేశీ సంస్థానాల్లో నాలుగు మినహా మిగిలినవన్నీ భారతదేశంలో విలీనమయ్యాయి. ఆ నాలుగు రాజ్యాలు ట్రావెన్‌ కోర్, హైదరాబాద్, జమ్మూ-కశ్మీర్, జునాగఢ్‌.

నాటి హైదరాబాద్‌ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ భారతదేశంలో విలీనమవడానికి నిరాకరించి హైదరాబాద్‌ సార్వభౌమ స్వతంత్ర రాజ్యంగా కొనసాగాలని ప్రకటించాడు. ఆ నిర్ణయం ఫలితంగా హైదరాబాద్‌ నిజాం భారత ప్రభుత్వంతో యథాతథ ఒప్పందం (స్టాండ్‌స్టిల్‌ అగ్రిమెంట్‌) చేసుకున్నాడు. దీనిపై నాటి భారతదేశ గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ మౌంట్‌ బాటన్, హైదరాబాద్‌ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ 1947 నవంబరు 29న సంతకాలు చేశారు.

రజాకార్ల అకృత్యాలు..

ఖాసీం రజ్వీ 1946లో రజాకార్‌ వ్యవస్థకు అధ్యక్షుడయ్యాడు. ఇతడు మజ్లిస్‌ ఇత్తెహాద్‌ ఉల్‌ ముస్లిమీన్‌ (ఎంఐఎం) నాయకుడు కూడా. నిజాం రాజు సూచన మేరకు రజాకార్లను సైనికశక్తిగా రూపొందించాడు. వారి ద్వారా హిందువులకు వ్యతిరేకంగా పోరాటం చేసి, హైదరాబాద్‌ రాజ్యంలో ఇస్లాం వ్యాప్తికి కృషి చేశాడు. అతడి ఆధ్వర్యంలోని రజాకార్లు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు.

రజాకార్ల అరాచకాలు, అకృత్యాలు, హత్యలు, అత్యాచారాలు అదుపు లేకుండా సాగాయి. ఈ కారణంగా అనేకమంది ప్రజలు తమ గ్రామాలను విడిచి వెళ్లారు. ఎక్కడ చూసినా అశాంతి చెలరేగింది. 

ఆపరేషన్‌ పోలో..

నాటి హైదరాబాద్‌ రాజ్యంలో కొనసాగిన రజాకార్ల అకృత్యాలు, నిజాం నిరంకుశపాలన, కమ్యూనిస్టుల తిరుగుబాటు చర్యలను అణిచి వేసి, రాజ్యంలో శాంతి భద్రతలను నెలకొల్పడానికి భారత ప్రభుత్వం ఆపరేషన్‌ పోలో పేరుతో పోలీస్‌ చర్యకు సిద్ధమైంది. ఈ చర్య శాంతి భద్రతలకు సంబంధించింది కాబట్టి దీన్ని పోలీస్‌ చర్యగా పేర్కొన్నారు. ఇందులో పాల్గొన్నది మాత్రం భారత సైన్యమే.

ఆపరేషన్‌ పోలో చర్యలో భాగంగా భారత సైన్యం హైదరాబాద్‌ రాజ్యంపై అన్ని దిక్కుల నుంచి దాడి చేసింది.

భారత సైనికాధికారి మేజర్‌ జనరల్‌ జె.ఎన్‌.చౌదరికి ఏ విధమైన షరతులు లేకుండా లొంగిపొమ్మని నిజాం తన సైన్యాధిపతి సయ్యద్‌ అహ్మద్‌ ఎల్‌ ఇద్రూస్‌ను ఆదేశించాడు. సెప్టెంబరు 17న నిజాం అధికారికంగా హైదరాబాద్‌ భారతదేశంలో విలీనమైందని ప్రకటించాడు.

సెప్టెంబరు 18న భారత ప్రభుత్వం హైదరాబాద్‌ రాష్ట్రంలో మిలటరీ పాలన విధించి, మేజర్‌ జనరల్‌ జె.ఎన్‌.చౌదరిని హైదరాబాద్‌ మిలటరీ గవర్నర్‌గా నియమించింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram