సత్యం, అహింస ఎప్పటి నుంచో మన సమాజంలో నాటుకు పోయాయి. తరతరాలుగా ప్రపంచంలోని అన్ని సమాజాలు వాటిని గౌరవిస్తూనే ఉన్నాయి. అయితే ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని పాటిస్తూ, తన తోటివారు కూడా ఆచరించేలా చేయడంలో గాంధీజీ విజయం సాధించారు. హింసతో సాధించేదేదీ లేదు, అహింసతోనే విజయం పొందొచ్చు అన్న గాంధీ సిద్ధాంతం దేశానికి స్వరాజ్యం తెచ్చింది.
విశ్వవ్యాప్తంగా ఉన్న ఎందరో పోరాట యోధులకు ప్రేరణగా నిలిచి, శాంతి మార్గంలో నడిచేలా చేసింది. భారత స్వాతంత్య్రోద్యమ నాయకుడు, అహింసావాది అయిన మహాత్మా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏటా అక్టోబరు 2న ‘అంతర్జాతీయ అహింసా దినోత్సవం’ (International Day of Non-Violence) గా నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఐక్యత, శాంతి, సామరస్యాన్ని సాధించడంలో అహింస పాత్ర ఎంత గొప్పదో తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం:
మహాత్మా గాంధీ ప్రోత్సహించిన అహింసా విధానాలను విశ్వవ్యాప్తం చేసే లక్ష్యంతో ఒక ప్రత్యేకమైన రోజు ఉండాలని ఐక్యరాజ్య సమితి భావించింది. ఇందుకు అనుగుణంగానే ఆయన జన్మదినమైన అక్టోబరు 2న ప్రతి సంవత్సరం ‘అంతర్జాతీయ అహింసా దినోత్సవం’గా జరుపుకోవాలని యూఎన్ జనరల్ అసెంబ్లీ 2007, జూన్ 15న తీర్మానించింది. అప్పటి నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు.