5 ఏళ్లలోపే కంపెనీలకు సారథ్యం వహిస్తున్న 155 మంది భారతీయ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల జాబితాను అవెండస్ వెల్త్-హురున్ ఇండియా సంయుక్తంగా వెలువరచాయి. వీరి మొత్తం సంపద (443 బి. డాలర్లు/రూ.39 లక్షల కోట్లు) భారత జీడీపీలో పదో వంతు. 2025 సెప్టెంబరు 1 నాటికి తొలి తరం వ్యవస్థాపకులైతే 50 మి. డాలర్ల (సుమారు రూ.444 కోట్ల)కు పైగా విలువ ఉన్న కంపెనీలను, తదుపరి తరం కుటుంబ వ్యాపారాలైతే కనీసం 100 మి. డాలర్ల (సుమారు రూ.888 కోట్ల) విలువ ఉన్న వాటిని పరిగణనలోకి తీసుకుని ఈ జాబితాను విడుదల చేశారు. దీని ప్రకారం..
అండర్-35 ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను అధికంగా కలిగిన నగరాల్లో బెంగళూరు అగ్రస్థానం(54)లో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో ముంబయి(29), దిల్లీ (22) ఉన్నాయి. ఆరుగురితో హైదరాబాద్ అయిదో స్థానంలో ఉంది. రాష్ట్రాల వారీగా చూస్తే కర్ణాటక (54 మంది), మహారాష్ట్ర (33), దిల్లీ (22) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.