అమ్మాయిలకు కనీస వివాహ వయసు 18 ఏళ్లుగా చట్టం నిర్దేశించినా.. దేశవ్యాప్తంగా ఆలోపు వయసులోనే పెద్దసంఖ్యలో వివాహాలవుతున్నాయని కేంద్ర గణాంకాల శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించి 2019-21 సర్వే నివేదికను తాజాగా విడుదల చేసింది. జాతీయంగా సగటున 23.3% మంది అమ్మాయిలకు 18 ఏళ్లలోపే వివాహాలవుతున్నట్లు పేర్కొంది. ఈ విషయంలో 41.6 శాతంతో పశ్చిమబెంగాల్, 40.8 శాతంతో బిహార్ తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్(29.3%) 7, తెలంగాణ(23.5%) 8 స్థానాల్లో ఉన్నాయి. జమ్మూకశ్మీర్ 4.5 శాతంతో చివరన నిలిచింది.
అబ్బాయిలకు చట్టం నిర్దేశించిన వివాహ వయసు 21 ఏళ్లు కాగా... జాతీయంగా సగటున 17.7% మందికి ఆలోపే వివాహాలవుతున్నాయని నివేదిక స్పష్టంచేసింది. అత్యధికంగా బిహార్‌లో 30.5, మధ్యప్రదేశ్‌లో 30.1, పశ్చిమబెంగాల్‌లో 20, తెలంగాణలో 16.3, ఏపీలో 14.5% అబ్బాయిలు 21 ఏళ్లకు ముందే వివాహబంధంలోకి అడుగుపెడుతున్నారు. కేరళలో ఇలా పెళ్లి చేసుకుంటున్న అబ్బాయిలు 1.4 శాతమే.