భారతదేశంలో అత్యంత సంపన్నుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ, రెండో స్థానంలో అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీ నిలిచారు. ఇటీవల వెలువడిన ఎం3ఎం హురున్ ఇండియా సంపన్నుల జాబితా- 2025 ప్రకారం, కుటుంబ సభ్యులతో కలిసి ముకేశ్ అంబానీ సంపద రూ.9.55 లక్షల కోట్లు కాగా, గౌతమ్ అదానీ సంపద రూ.8.15 లక్షల కోట్లుగా ఉంది.
రూ.1,000 కోట్ల నుంచి సంపద కలిగిన మొత్తం 1700 మందితో ఈ జాబితా రూపొందించినట్లు హురున్ వెల్లడించింది. ఈ జాబితాలో 101 మంది మహిళలున్నారు.
మనదేశంలో బిలియనీర్ల సంఖ్య (రూ.8,800 కోట్లకు మించి ఆస్తి కలిగిన వారు) 350కు మించింది. తాజా జాబితా ప్రకారం ప్రస్తుత బిలియనీర్లందరి సంపద విలువ కలిసి రూ.167 లక్షల కోట్లకు చేరింది. ఇది మనదేశ జీడీపీలో దాదాపు సగానికి సమానం.
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఛైర్‌పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా, భారతదేశపు అత్యంత ధనిక మహిళగా గుర్తింపు సాధించారు. ఆమె సంపద విలువ రూ.2.84 లక్షల కోట్లని నివేదిక తెలిపింది.
451 మంది అత్యంత సంపన్నులతో ముంబయి మొదటి స్థానంలో ఉంది.