భారత్‌కున్న బలమైన ఆర్థిక మూలాలను పరిగణనలోకి తీసుకుని భారత దీర్ఘకాలిక దేశీయ, విదేశ కరెన్సీ ఇష్యూయర్ రేటింగ్స్, దేశీయ కరెన్సీ అన్‌సెక్యూర్డ్ రేటింగ్‌ను అంతర్జాతీయ ఏజెన్సీ మూడీస్ ‘బీఏఏ3’గా నిర్ణయించింది. బలమైన ఆర్థిక వృద్ధి కారణంగా భవిష్యత్తు అంచనాలనూ ‘స్థిరం’గా కొనసాగించింది. ఇతర స్వల్పకాల దేశీయ రేటింగ్‌ను పీ-3 వద్ద ఉంచింది. అమెరికా టారిఫ్‌లు, ఇతర అంతర్జాతీయ విధాన చర్యల నేపథ్యంలో.. అనిశ్చితులు ఉన్నా భారత్‌కున్న ఈ బలాల వల్ల తయారీలోకి పెట్టుబడులను ఆకర్షించగలుగుతోందని తెలిపింది.
ఇతర అంశాలు:
ఆసియా పసిఫిక్ (15-20%) ప్రాంతంతో పోలిస్తే భారత్‌పై అమెరికా విధించిన అధిక సుంకాల (50%) వల్ల భారత ఆర్థిక వృద్ధిపై పరిమిత ప్రతికూల ప్రభావమే ఉండొచ్చు. దీని వల్ల మధ్య-దీర్ఘకాలంలో అధిక విలువ జోడించిన తయారీ ఎగుమతులు చేయాలన్న భారత లక్ష్యాలకు ఇబ్బంది కలగొచ్చు.
అమెరికా, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం ఫలిస్తే, సుంకాలు తగ్గుతాయి. ఇతర విధానాల్లో (వీసా ఫీజులు) మార్పులు ఉండకపోవచ్చు.