మన దేశం నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.37.02 లక్షల కోట్ల (437.42 బిలియన్ డాలర్లు) విలువైన ఎగుమతులు జరిగాయని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ (ఫియో) 2025, ఆగస్టు 5న వెల్లడించింది. ఇందులో 116.33 బిలియన్ డాలర్ల (రూ.9.83 లక్షల కోట్లు) విలువైన ఎగుమతులతో గుజరాత్ అగ్ర స్థానంలో ఉందని తెలిపింది. దేశీయ ఎగుమతుల్లో గుజరాత్ వాటా 26.6 శాతంగా ఉంది. గుజరాత్‌లోని జామ్‌నగర్ నుంచే రూ.3.63 లక్షల కోట్ల విలువైన పెట్రోలియం, రిఫైనరీ ఉత్పత్తులు ఎగుమతి కావడంతో ఆ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని వెల్లడించింది.
• తెలుగు రాష్ట్రాలు ఎగుమతుల పరంగా 6, 7 రాష్ట్రాల్లో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ ఎగుమతుల్లో 24.40%, తెలంగాణ ఎగుమతుల్లో 23.60% అమెరికాకే చేరుతున్నాయి. తెలంగాణ ఎగుమతుల్లో 29.47% ఎయిర్‌క్రాఫ్ట్, స్పేస్‌క్రాఫ్ట్‌ల విడిభాగాలు, 26.80% ఔషధ ఫార్ములేషన్లు, బయోలాజిక్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎగుమతుల్లో 15.45% మత్య్స ఉత్పత్తులు, 10.38% ఔషధ ఫార్ములేషన్లు - బయోలాజిక్స్ ఉన్నాయి.