ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్లు ఒకేరోజు రెండు స్వర్ణాలు సహా నాలుగు పతకాలు నెగ్గారు. 2025, సెప్టెంబరు 30న దిల్లీలో జరిగిన జావెలిన్‌త్రోలో రెండు పసిడి పతకాలు సొంతమయ్యాయి. పురుషుల ఎఫ్64 విభాగంలో సుమిత్ అంటిల్ జావెలిన్‌ను 71.37 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో తానే సృష్టించిన ఛాంపియన్‌షిప్ రికార్డు (70.83 మీ, 2023లో)ను తుడిచిపెట్టాడు. ఈ టోర్నీలో పసిడి హ్యాట్రిక్ కూడా కొట్టాడు. 2023, 24లోనూ అతడు స్వర్ణాన్ని నెగ్గాడు.
పురుషుల ఎఫ్44 జావెలిన్ త్రోలో సంజయ్ స్వర్ణం.. సందీప్ చౌదరి రజతంతో మెరిశారు. సంజయ్ 62.82 మీటర్ల త్రోతో పసిడి సొంతం చేసుకోగా.. సందీప్ 62.67 మీటర్లతో రజతం గెలిచాడు. ఎడినిల్‌సన్ (బ్రెజిల్, 62.36 మీ) కాంస్యం దక్కించుకున్నాడు.