దేశవ్యాప్తంగా ఏకంగా 8.82 లక్షల ఎగ్జిక్యూషన్ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ పరిస్థితి ఆందోళనకరమని, అవాంఛనీయమని వ్యాఖ్యానించింది. కోర్టు ఉత్తర్వులు అమలయ్యేలా చూడాలని కోరుతూ డిక్రీ హోల్డర్‌లు దాఖలు చేసే ఈ తరహా పిటిషన్‌లపై 2025 మార్చి 6న తాము ఇచ్చిన ఉత్తర్వుల అమలును జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ పంకజ్ మిత్తల్‌ల ధర్మాసనం ఇటీవల సమీక్షించింది.
గతంలో విచారణ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ పిటిషన్‌లను 6 నెలల్లోపు పరిష్కరించేలా తమ పరిధిలోని సివిల్ కోర్ట్‌లకు నిర్దేశించాలని హైకోర్టులను ఆదేశించాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3.38 లక్షల పిటిషన్‌లపై మాత్రమే తీర్పులు వెలువడ్డాయి. తీర్పు లేదా ఉత్తర్వు వచ్చాక కూడా క్షేత్ర స్థాయిలో అమలు జరగడం ఆలస్యమైతే న్యాయం జరగనట్టే అని విచారణ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది.