దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో 2025, సెప్టెంబరు 23న 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. విజేతలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అవార్డులతో పాటు ప్రశంసాప్రతాలను అందజేశారు. ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్ ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్నారు. ‘జవాన్’ చిత్రానికి షారుక్ ఖాన్, ‘ట్వల్త్ ఫెయిల్’కు విక్రాంత్ మాస్సే ఉత్తమ నటులుగా, ఉత్తమ నటిగా రాణీ ముఖర్జీ (మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే) పురస్కారాలు స్వీకరించారు.
ఉత్తమ తెలుగు ప్రాంతీయ చిత్రంగా నిలిచిన ‘భగవంత్ కేసరి’కి దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి, ‘బేబి’ చిత్రానికి ఉత్తమ నేపథ్య గాయకుడిగా పీవీఎన్‌ఎస్ రోహిత్, ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా సాయి రాజేశ్ నీలం పురస్కారాలు స్వీకరించారు.