జోయెల్ మోకిర్, ఫిలిప్ అఘియన్, పీటర్ హౌవిట్‌లకు 2025 ఏడాదికి సంబంధించి అర్థ శాస్త్రంలో నోబెల్ వరించింది. ఆర్థిక వృద్ధిపై నవకల్పనల ప్రభావాన్ని విపులంగా విశదీకరించడంతో పాటు కీలకమైన ‘సృజనాత్మక విధ్వంసం’ అనే భావనపై విస్తృత పరిశోధనలు చేసినందుకు వీరికి ఈ అవార్డు దక్కింది. మోకిర్ ఆర్థిక చరిత్రకారుడు. చారిత్రక ఆధారాలను విశ్లేషిస్తూ.. దీర్ఘకాలిక ధోరణులపై ఆయన పరిశోధనలు సాగించారు. హౌవిట్, అఘియన్ అందుకు భిన్నమైన పంథాను అనుసరించారు. సృజనాత్మక విధ్వంసం ఎలా పనిచేస్తుందో వివరించేందుకు గణిత శాస్త్రంపై వారు ఆధారపడ్డారు.
మోకిర్ (79) నెదర్లాండ్స్‌లో జన్మించారు. ప్రస్తుతం అమెరికాలోని నార్త్‌వెస్టర్న్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. ఫ్రాన్స్‌కు చెందిన అఘియన్ (69).. పారిస్‌లోని కాలేజ్ డి ఫ్రాన్స్‌తో పాటు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌కు అనుబంధంగా పరిశోధనలు కొనసాగిస్తున్నారు. హౌవిట్ (79) కెనడాలో జన్మించారు. అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు.