దశాబ్దాల నుంచి కార్మికుల హక్కులను కాలరాస్తున్న కఫాలా వ్యవస్థను సౌదీ అరేబియా ఇటీవల రద్దు చేసింది. ఈ నిర్ణయంతో భారతీయులతోపాటు దక్షిణాసియాలోని చాలా మంది కార్మికులకు స్వేచ్ఛ లభించనుంది. కఫాలా అంటే అరబిక్ భాషలో స్పాన్సర్‌షిప్ అని అర్థం. సౌదీ అరేబియాకు చెందిన ఓ వ్యక్తి తన వ్యాపార లేదా గృహ అవసరాల కోసం మరో దేశం నుంచి కార్మికుడిని రప్పించుకుంటే.. వలసదారుపై ఆ వ్యక్తికి (యజమానికి) ఏయే హక్కులు ఉంటాయో వివరించేదే కఫాలా.
సౌదీ అరేబియాలో దాదాపు 1.34 కోట్ల మంది వలసకార్మికులు ఉన్నారు. మొత్తం జనాభాలో వీరిది దాదాపు 40 శాతం. కఫాలా సాధారణంగా తక్కువ వేతనం ఉన్న ఉద్యోగాలకే వర్తిస్తుంది. నిర్మాణ రంగ కార్మికులు, పనిమనుషులు, పారిశ్యుద్ధ కార్మికులు, డ్రైవర్లు, క్లీనర్లు ఈ జాబితాలో ఉన్నారు. వీరంతా సాధారణంగా భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్, నేపాల్, ఇథియోపియా నుంచి వలస వచ్చినవారే.