ప్రపంచంలోనే అత్యధిక రుణభారం అమెరికా మీద ఉంది. ఇందులో పావు వంతు మిగతా దేశాలది. అమెరికా ప్రభుత్వం తన రుణదాతలకు చెల్లించాల్సిన మొత్తం సొమ్ము ప్రస్తుతం 37 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇది అమెరికా జీడీపీలో 122 శాతానికి సమానం. ప్రతి మూడు నెలలకు రుణభారం దాదాపు లక్షల కోట్ల డాలర్లు పెరుగుతోంది. 2020లో కొవిడ్ సమయంలో అత్యధికంగా రుణాలు, జీడీపీ నిష్పత్తి 133 శాతానికి చేరింది. ప్రపంచంలోనే ఈ నిష్పత్తి అధికంగా ఉన్న మొదటి 10 దేశాల్లో అమెరికా కూడా ఉంది.
* అమెరికా ఆర్థిక వ్యవస్థ పరిమాణం 30.3 లక్షల కోట్ల డాలర్లు కాగా.. ఆ దేశ రుణ భారం అంతకంటే ఎక్కువగా దాదాపు 37 లక్షల కోట్ల డాలర్లకు చేరింది.
* ప్రభుత్వం పన్ను వసూళ్ల కంటే వ్యయాలు అధికంగా చేస్తే లోటు ఏర్పడుతుంది. ఈ లోటును పూడ్చడానికి రుణాలపై ఆధారపడాల్సి వస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం రుణాల పరిమితిని అమెరికా కాంగ్రెస్ నిర్దేశిస్తోంది. పరిమితిని చేరుకున్న తర్వాత, కాంగ్రెస్ దాన్ని పెంచకపోతే ప్రభుత్వం రుణాలు తీసుకోవడం కుదరదు.