ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

గెలీలియో గెలిలీ

ఈయన ఇటలీకి చెందిన ప్రముఖ పండితుడు, గణిత - ఖగోళ - భౌతిక శాస్త్రవేత్త. చలనం, యాంత్రిక శాస్త్రంపై ఆయన ఎన్నో పరిశోధనలు చేశారు. ఖగోళ రహస్యాలను ఛేదించేందుకు టెలిస్కోప్‌ను ఉపయోగించారు.


ఈయన ఇటలీకి చెందిన ప్రముఖ పండితుడు, గణిత - ఖగోళ - భౌతిక శాస్త్రవేత్త. చలనం, యాంత్రిక శాస్త్రంపై ఆయన ఎన్నో పరిశోధనలు చేశారు. ఖగోళ రహస్యాలను ఛేదించేందుకు టెలిస్కోప్‌ను ఉపయోగించారు. ప్రయోగాత్మక భౌతికశాస్త్రం (experimental physics) అభివృద్ధికి ఇది ఎంతగానో దోహదం చేసింది. కోపర్నికస్‌ ప్రతిపాదించిన సూర్యకేంద్రక సిద్ధాంతం సరైందని గెలీలియో ప్రయోగాత్మకంగా నిరూపించారు. నాటి సమాజంలో పేరుకుపోయిన ఎన్నో అంధ విశ్వాసాలను తప్పని తన పరిశోధనల ద్వారా రుజువు చేశారు. గెలీలియోతోనే ఆధునిక విజ్ఞానం ప్రారంభమైంది. అందుకే ఈయన్ను ‘ఫాదర్‌ ఆఫ్‌ మోడ్రన్‌ సైన్స్‌’గా పిలుస్తారు. పోటీపరీక్షల నేపథ్యంలో ఈయన జీవితంలోని ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం..!

బాల్యం - వృత్తి జీవితం

  • గెలీలియో గెలిలీ 1564, ఫిబ్రవరి 15న ఇటలీలోని పీసా నగరంలో జన్మించారు. పేదరికం, కుటుంబ పరిస్థితుల కారణంగా 11 ఏళ్ల వయసు వరకు ఇంట్లో తండ్రి వద్దే చదువుకున్నారు. ప్రకృతిలోని విషయాలను తెలుసుకోవడం, సైన్స్‌ పుస్తకాలను చదవడం అప్పుడే మొదలుపెట్టారు.
  • 1575లో వల్లోంబ్రోసా అబ్బేలోని కమల్డోలీస మొనాస్టరీ అనే ఆధ్యాత్మిక శిక్షణ కేంద్రంలో చేరారు. అందులో ఆయన హ్యుమానిటీస్, చిత్రలేఖనంతోపాటు లాటిన్, గ్రీకు, మతం, తర్కం, సంగీతం లాంటి శాస్త్రీయ విషయాలను అభ్యసించారు.
  • తండ్రి కోరిక మేరకు  వైద్య విద్యను అభ్యసించడానికి 1581లో పీసా విశ్వవిద్యాలయంలో చేరారు. ఒకసారి ఆయన యూనివర్సిటీలో ప్రముఖ గణితవేత్త ఓస్టిలియో రిక్కీ ఉపన్యాసం విని, దానికి ఆకర్షితులయ్యారు. ఫలితంగా మెడిసన్‌ కంటే మ్యాథ్స్‌పై ఆసక్తి పెంచుకున్నారు. ముఖ్యంగా యూక్లిడ్, ఆర్కిమెడిస్‌ గణిత రచనలను అధ్యయనం చేయడం ప్రారంభించారు. తాను పరిశోధించిన విషయాలను రిక్కీతో పంచుకునేవారు. గణితంపై గెలీలియో చూపిస్తున్న ఉత్సుకతను గుర్తించిన ఆయన మ్యాథ్స్, సైన్స్‌ను అభ్యసించాలని సలహా ఇచ్చారు. దీంతో ఆయన మెడిసిన్‌ విద్యను మధ్యలో విడిచి మ్యాథ్స్, ఫిజిక్స్, ఫిలాసఫీ అధ్యయనాన్ని ప్రారంభించారు.
  • ప్రకృతిలోని అనేక విషయాలు గణితంతో ముడిపడి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రిక్కీతో కలిసి అనేక అంశాలపై ప్రయోగాలు చేశారు. డిగ్రీ పట్టా లేకుండానే 1585లో యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చి ఫ్లోరెన్స్, సియానాలో కొన్నేళ్లపాటు ప్రైవేట్‌ ట్యూటర్‌గా పనిచేశారు. తన అభ్యసనాల ఫలితంగా గణితశాస్త్రంలో ఎన్నో పేరు ప్రఖాతులు సంపాదించుకున్నారు.

ముఖ్యమైన పరిశోధనలు - ఆవిష్కరణలు

  • గెలీలియో చేసిన పరిశోధనలు, నిరూపించిన విషయాలన్నీ ప్రముఖ గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్‌ (క్రీ.పూ 384-322) భావనలు, సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉండేవి. ఆయన చెప్పిన అనేక విషయాలు తప్పని గెలీలియో తన ప్రయోగాల ద్వారా నిరూపించారు.  
  • భౌతికశాస్త్రంలో హైడ్రోస్టాటిక్స్‌పై అధ్యయనం చేశారు. సమతౌల్యత, బరువు సూత్రాలు; వస్తువుల నిర్దిష్ట గురుత్వాకర్షణను నిర్ణయించే వివిధ పద్ధతులను కనుక్కున్నారు. ఈ విషయాలన్నింటితో 1586లో ‘ది లిటిల్‌ బ్యాలెన్స్‌ (లా బిలాన్సెట్టా)’ అనే పుస్తకం రాశారు. 
  • అప్పటికే ఉన్న టెలిస్కోప్‌ను మెరుగుపరిచి, 1609లో కొత్తదాన్ని నిర్మించారు. దీని సాయంతో బృహస్పతి - 4 ఉపగ్రహాలు, సూర్యుడి మచ్చలు, చంద్రుడి ఉపరితలంపై ఉన్న బిలాలు, శుక్ర గ్రహం దశలను మొదటిసారి గమనించారు

చివరగా

  • గెలీలియో సిద్ధాంతాలు, ఆవిష్కరణలు ఎందరికో మార్గదర్శకంగా నిలిచాయి. ముఖ్యంగా ఐజాక్‌ న్యూటన్‌ లాంటి భవిష్యత్‌ శాస్త్రవేత్తలకు మార్గం సుగమం చేశాయి. మతవిశ్వాసాలను లెక్క చేయక, తాను నిరూపించిన దాన్ని అందరికీ తెలిసేలా చేశారు. ఆయన గణితాన్ని విజ్ఞానశాస్త్రంలో ప్రవేశపెట్టారు. దీంతో సైన్స్‌కు కచ్చితత్వం వచ్చింది. ‘‘గెలీలియో కారణంగానే ఈ విశాల విశ్వంలోని అనేక రహస్యాలను వివరంగా విశ్లేషిస్తున్నాను’’ అని న్యూటన్‌ అన్నారు. విజ్ఞానశాస్త్ర అభివృద్ధికి ఆయన ఎంతగా కృషి చేశారో దీని ద్వారా అర్థమవుతోంది. గెలీలియో 1642, జనవరి 8న మరణించారు.

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

(ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్, 2024)

Q: గెలీలియో లా ఆఫ్‌ పెండ్యులమ్‌ను కింది ఏ సంవత్సరంలో నిర్వచించారు?

1) 1600    2) 1599        3) 1605    4) 1602

సమాధానం: 4

(ఎన్‌టీపీసీ టైర్‌ 1, 2016)

Q: బృహస్పతికి ఎన్ని ఉపగ్రహాలు ఉన్నట్లు గెలీలియో కనుక్కున్నారు?

1) 2    2) 3            3) 4    4) 5

సమాధానం: 3

(RRB NTPC CBT-I, 2021)

Q: Who is considered to be the 'father of modern science'?
1) CV Raman            2) Vikram Sarabhai
3) Galileo Galilei        4) Stephen Hawking
Answer: 3

(NTPC CBT-I, 2021)

Q: Who wrote the book 'The Little Balance (La Balancitta)' in 1586?
1) Archimedes            2) Galileo Galilei
3) James Prescott        4) Carolus Linnaeus
Answer: 2

 


Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram