ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

ఎర్నెస్ట్‌ హెకెల్‌

ఈయన జర్మనీకి చెందిన ప్రముఖ జంతుశాస్త్రవేత్త, జీవశాస్త్రవేత్త. జువాలజీ రంగంలో విశేష పరిశోధనలు చేశారు. భూమిపై అప్పటి వరకు గుర్తించని అనేక కొత్త రకం జాతులను కనుక్కుని, వాటికి పేర్లు పెట్టి, వాటి వంశానుక్రమాన్ని మ్యాప్‌ చేశారు.


ఈయన జర్మనీకి చెందిన ప్రముఖ జంతుశాస్త్రవేత్త, జీవశాస్త్రవేత్త. జువాలజీ రంగంలో విశేష పరిశోధనలు చేశారు. భూమిపై అప్పటి వరకు గుర్తించని అనేక కొత్త రకం జాతులను కనుక్కుని, వాటికి పేర్లు పెట్టి, వాటి వంశానుక్రమాన్ని మ్యాప్‌ చేశారు. జీవశాస్త్రంలో అనేక కొత్త పదాలను సృష్టించారు. వాటిలో జీవావరణశాస్త్రం (ecology), ఫైలం (phylum), అంటోజెనీ (ontogeny) లాంటివి ఎంతో ప్రాచుర్యం పొందాయి. డార్విన్‌ ప్రతిపాదించిన సిద్ధాంతాలను బలంగా విశ్వసించడంతోపాటు వాటి ఆధారంగానే తన పరిశోధనలు సాగించారు. ఈయన ‘బయోజెనెటిక్‌ లా’ (recapitulation theory)ను ప్రతిపాదించారు. ఆవరణ వ్యవస్థలో జీవజాతుల మనుగడ, సంబంధాలు మొదలైన విషయాలపై ఆయన ప్రయోగాలు నిర్వహించి వాటిని గ్రంథస్థం చేశారు. ఫిబ్రవరి 16న ఎర్నెస్ట్‌ హెకెల్‌ జయంతి సందర్భంగా ఆయన జీవితంలోని ముఖ్య విశేషాల గురించి తెలుసుకుందాం..!

బాల్యం - వృత్తి జీవితం

  • పూర్తి పేరు ఎర్నెస్ట్‌ హెన్రిచ్‌ ఫిలిప్‌ ఆగస్ట్‌ హెకెల్‌. 1834, ఫిబ్రవరి 16న జర్మనీలోని పోట్స్‌డామ్ లో జన్మించారు. పాఠశాల విద్యను మెర్సెబర్గ్‌లో పూర్తి చేశారు.
  • చిన్నతనం నుంచే ఆయనకు జీవుల పుట్టుక, అందులోని వైవిధ్యం, వివిధ జాతులు మొదలైనవాటిపై ఆసక్తి ఉండేది.
  • 1843లో ఆయన మెర్సెబర్గ్‌లోని డోమ్‌జిమ్నాసియం పాఠశాలలో చేరారు. అక్కడ ఉపాధ్యాయుడిగా ఉన్న కార్ల్‌ గుడే ఆయనలోని ఉత్సాహాన్ని గమనించి, జీవ పరిణామం గురించిన అనేక విషయాలను, పుస్తకాలను పరిచయం చేశారు. చార్లెస్‌ డార్విన్‌ రచించిన ‘ది వాయేజ్‌ ఆఫ్‌ ది బీగల్‌’, మాథియాస్‌ జాకోబ్‌ ష్లీడెన్‌ గ్రంథమైన ‘ది ప్లాంట్‌: ఎ బయోగ్రఫీ’ జీవశాస్త్రంలో పరిశోధనలపై ఆయనలో మరింత ఆసక్తిని పెంపొందించాయి. సహజశాస్త్రం, వృక్షశాస్త్రంలో అక్కడే ఆయనకు బలమైన పునాది ఏర్పడింది.
  • 1852లో ఆయన వైద్యశాస్త్రం అభ్యసించేందుకు వర్జ్‌బర్గ్‌  యూనివర్సిటీకి వెళ్లారు. అక్కడ ఆయనకు ప్రముఖ శాస్త్రవేత్తలైన రుడాల్ఫ్‌ విర్చో (పాథాలజిస్ట్‌), అలెగ్జాండర్‌ బ్రౌన్‌ (వృక్షశాస్త్రవేత్త)తో పరిచయం ఏర్పడింది. వైద్యశాస్త్రం కంటే జీవ/ జంతుశాస్త్రాలపై తన ఆసక్తిని పెంచుకున్నారు. విర్చో, బ్రౌన్‌ వద్ద సహాయకుడిగా ఉండి మరిన్ని విషయాలు నేర్చుకున్నారు.
  • 1854లో ఆయన బెర్లిన్‌ యూనివర్సిటీలో చేరి, తన వైద్య విద్యను కొనసాగించారు. 1857లో మెడికల్‌ డిగ్రీ పొందారు.
  • 1858లో వైద్యుడిగా ప్రాక్టీస్‌ చేసేందుకు ప్రభుత్వం నిర్వహించే వైద్య పరీక్షను పూర్తి చేశారు. అయితే ఆయనకు క్లినికల్‌ ప్రాక్టీస్‌పై ఆసక్తి లేకపోవడంలో మళ్లీ జంతుశాస్త్రంవైపు మొగ్గు చూపారు. ప్రధానంగా అకశేరుకాలు (invertebrates), డార్వినిజంపై అధ్యయనం చేశారు.
  • 1862లో జువాలజీ ప్రొఫెసర్‌గా ఆయన జెనా యూనివర్సిటీలో చేరారు. 1865లో అదే యూనివర్సిటీ నుంచి జంతుశాస్త్రంలో పీహెచ్‌డీ పొందారు. 1909 వరకు ఆయన అదే విశ్వవిద్యాలయంలో  పనిచేశారు.

ముఖ్యాంశాలు

  • 1859-66 మధ్య కాలంలో రేడియోలేరియన్లు, పొరిఫెరాన్స్‌ (స్పాంజ్‌లు), అనెలిడ్స్‌ (సెగ్మెంటెడ్‌ వార్మ్స్‌) లాంటి అనేక ఫైలాలపై పరిశోధనలు చేశారు. మధ్యధరా సముద్రంపై పర్యటించి సుమారు 700 కొత్త జాతుల రేడియోలేరియన్లకు పేరు పెట్టారు.
  • 1866లో ఆయన ‘బయోజెనెటిక్‌ లా’ను ప్రతిపాదించారు. ఓంటోజెని (ఒక జీవి అభివృద్ధి) అనేది ఫైలోజెని (జాతుల పరిణామ చరిత్ర) సంక్షిప్త రూపం అని ఆయన పేర్కొన్నారు.
  • 1866లో ప్రొటిస్టా రాజ్యాన్ని ప్రతిపాదించారు.
  • ఐరోపాలో డార్విన్‌ సిద్ధాంతాన్ని విస్తృతం చేసిన వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు.
  • ఎకాలజీ, ఫైలం, ప్రొటిస్టా, అంటోజెనీ లాంటి అనేక పదాల సృష్టికర్త ఈయనే. 

చివరగా

  • Art Forms in Nature, The Art & Science of Ernst Haeckel, Riddle of the Universe, Creatures of the Deep: The Pop-up Book, The Evolution of Man, Kunstformen der Natur - Kunstformen aus dem Meer, Art Forms in Nature: Coloring Book లాంటి ప్రముఖ పుస్తకాలను ఎర్నెస్ట్‌ హెకెల్‌ రచించారు. జీవశాస్త్రంపై తనకున్న అభిరుచితోపాటు తాను పరిశోధించిన విషయాలతో ఆయన ఈ రచనలు చేశారు. ఆయన పరిశోధనలు ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచాయి. 1866లో జీవులకు వాటి పర్యావరణంతో ఉన్న సంబంధాన్ని అధ్యయనం చేసే కొత్త పదానికి ‘ఎకాలజీ’ అని పేరు పెట్టారు. ఆయన 1894లో లీనియన్‌ మెడల్, 1908లో డార్విన్‌-వాలెస్‌ పతకం పొందారు. ఎర్నెస్ట్‌ హెకెల్‌ 1919, ఆగస్టు 9న మరణించారు.

గత పరీక్షల్లో అడిగిన  ప్రశ్నలు

ప్రశ్న: జీవుల ఆర్థిక వ్యవస్థలను వివరించడానికి ఎర్నెస్ట్‌ హెకెల్‌ ‘ఎకాలజీ’ అనే పదాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?

(ఎస్‌ఎస్‌సీ సీపీఓ, 2023)

1) 1888  2) 1884

3) 1887  4) 1866

సమాధానం: 4

ప్రశ్న: జీవావరణశాస్త్రం అనే పదాన్ని ఎవరు సృష్టించారు?

(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ టీజీటీ, 2018)

1) హెకెల్‌    2) డార్విన్‌

3) హాక్స్లి    4) లిన్నేయస్‌

సమాధానం: 1

Q. Which scientist in his recapitulation theory said that "ontogeny recapitulates phylogeny"?

(Bihar STET PGT (Zoology), 2023)

1) Ernst Haeckel 

2) Louis Pasteur

3) Charles Darwin 

4) S. L. Miller

Ans: 1


Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram