ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

సర్‌ జోసెఫ్‌ జాన్‌ థామ్సన్‌ 

జె.జె.థామ్సన్‌గా సుపరిచితులైన ఈయన ఇంగ్లండ్‌కు చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. పరమాణువుల్లో ఎలక్ట్రాన్‌ అనే ఉపకణం ఉంటుందని తొలిగా గుర్తించింది ఈయనే.


జె.జె.థామ్సన్‌గా సుపరిచితులైన ఈయన ఇంగ్లండ్‌కు చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. పరమాణువుల్లో ఎలక్ట్రాన్‌ అనే ఉపకణం ఉంటుందని తొలిగా గుర్తించింది ఈయనే. శాస్త్ర సాంకేతిక రంగంలో అనేక విప్లవాత్మక మార్పులకు ఇది కారణమైంది. ఎలక్ట్రాన్‌ను కనుక్కున్నందుకు గానూ ఆయనకు నోబెల్‌ పురస్కారం లభించింది. పరమాణు నమూనాను మొదటిసారి ప్రతిపాదించిన శాస్త్రవేత్త జె.జె.థామ్సన్‌. దీని ఆధారంగానే ఎందరో శాస్త్రజ్ఞులు వివిధ నమూనాలు అభివృద్ధి చేశారు. ఎలక్ట్రాన్ల పితామహుడిగా (father of electrons) పేరొందిన థామ్సన్‌ జీవితంలోని ముఖ్య విశేషాల గురించి తెలుసుకుందాం..!

బాల్యం - వృత్తి జీవితం

  • జె.జె.థామ్సన్‌ 1856, డిసెంబరు 18న మాంచెస్టర్‌లోని చీతం హిల్‌లో జన్మించారు. పాఠశాల విద్యను మాంచెస్టర్‌లోని ప్రైవేట్‌ పాఠశాలలో పూర్తి చేశారు. చిన్నతనం నుంచే ఆయనకు సైన్స్‌ పట్ల ఆసక్తి ఉండేది. 
  • 1870లో 14ఏళ్ల వయసులో ఆయన ఓవెన్స్‌ కళాశాల (ప్రస్తుత మాంచెస్టర్‌ యూనివర్సిటీ)లో చేరారు. 1876 వరకు అందులోనే ఉండి గణితం, భౌతికశాస్త్రం, ఇంజినీరింగ్‌ చదివారు. అక్కడి ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌ బాల్ఫోర్‌ స్టీవర్ట్‌ ఆయనలోని ఆసక్తి గమనించి తనతో కలిసి పరిశోధనలు చేయాల్సిందిగా ఆహ్వానించారు. థామ్సన్‌ విద్యుత్, అయస్కాంతతత్వం గురించి అనేక విషయాలు తెలుసుకున్నారు
  • 1876లో కేంబ్రిడ్జ్‌లోని ట్రినిటీ కాలేజీలో గణితం చదివేందుకు థామ్సన్‌కు స్కాలర్‌షిప్‌ లభించింది. 1880లో బీఏ పట్టా అందుకున్నారు. అదే ఏడాది ట్రినిటీ కాలేజీకి ఫెలోగా ఎన్నికయ్యారు. మొదట్లో గణితశాస్త్రం, మాక్స్‌వెల్‌ విద్యుదయస్కాంత సిద్ధాంతంపై పరిశోధనలు చేశారు; మోషన్‌ ఆఫ్‌ వోర్టెక్స్‌ రింగ్స్, భౌతిక-రసాయన లక్షణాల మధ్య సంబంధాన్ని పరిశోధించారు. థామ్సన్‌ తన ప్రయోగాల ఆధారంగా రచించిన 'A Treatise on the Motion of Vortex Rings' వ్యాసానికి 1883లో ఆడమ్స్‌ బహుమతి లభించింది. అదే సంవత్సరం ట్రినిటీ కాలేజీ నుంచి మాస్టర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ (ఎంఏ) పట్టా పొందారు
  • 1884, డిసెంబరులో కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలోని కావెండిష్‌ ప్రయోగశాలలో ప్రొఫెసర్, డైరెక్టర్‌గా చేరారు. అక్కడ ఆయన అనేక ప్రయోగాత్మక పరిశోధనలు నిర్వహించారు. ఎన్నో ఆవిష్కరణలు చేశారు. 1918 వరకు అక్కడే పనిచేశారు. ఎందరో గొప్ప శాస్త్రవేత్తలకు కావెండిష్‌ ప్రయోగశాలలోనే ఆయన మార్గదర్శకత్వం చేశారు.
  • 1918లో ఆయన కేంబ్రిడ్జ్‌లోని ట్రినిటీ కాలేజ్‌లో మాస్టర్‌గా నియమితులయ్యారు. మరణించేవరకు అదే పదవిలో కొనసాగారు. 

పురస్కారాలు - గౌరవాలు

  • 1884లో రాయల్‌ సొసైటీకి ఫెలోగా ఎన్నికయ్యారు. 1916-20 వరకు దానికి అధ్యక్షుడిగా పనిచేశారు. 
  • 1906లో భౌతికశాస్త్రంలో నోబెల్‌ బహుమతి లభించింది.
  • 1908లో నైట్‌హుడ్‌ బహుమతి పొందారు.
  • 1914లో కోప్లీ మెడల్‌ అందుకున్నారు
  • 1923లో ఫ్రాంక్లిన్‌ మెడల్, స్కాట్‌ మెడల్‌ లభించాయి.
  • 1931లో డాల్టన్‌ మెడల్, 1938లో ఫారడే మెడల్‌ అందుకున్నారు. 

చివరగా..

  • థామ్సన్‌ ప్రముఖ శాస్త్రవేత్తే కాదు.. గొప్ప గురువు కూడా. ఆయన శిష్యులు ఏడుగురు నోబెల్‌ అందుకోవడమే ఇందుకు తార్కాణం. వారు: ఎర్నెస్‌ రూథర్‌ఫర్డ్‌ (1908, రసాయనశాస్త్రం), లారెన్స్‌ బ్రాగ్‌ (1915, భౌతికశాస్త్రం), చార్లెస్‌ బార్క్లా (1917, భౌతికశాస్త్రం), ఫ్రాన్సిస్‌ ఆస్టన్‌ (1922, రసాయనశాస్త్రం), చార్లెస్‌ థామ్సన్‌ రీస్‌ విల్సన్‌ (1927, భౌతికశాస్త్రం), ఓవెన్‌ రిచర్డ్‌సన్‌ (1928, భౌతికశాస్త్రం), ఎడ్వర్డ్‌ ఆపిల్టన్‌ (1947, భౌతికశాస్త్రం). ఆయన కుమారుడు జార్జ్‌ పేజెట్‌ థామ్సన్‌ కూడా 1937లో భౌతికశాస్త్రంలో నోబెల్‌ బహుమతి అందుకున్నారు. ఆయన సాగించిన పరిశోధనలు తర్వాతి కాలంలో ఎందరో శాస్త్రవేత్తలకు మార్గదర్శకమయ్యాయి. థామ్సన్‌ 1940, ఆగస్టు 30న ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్‌లో మరణించారు.


గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. కింది ఏ ఆవిష్కరణకు జె.జె.థామ్సన్‌కు భౌతికశాస్త్రంలో నోబెల్‌ బహుమతి లభించింది?(ఎస్‌ఎస్‌సీ సీజీఎల్, 2019)

1) ఎలక్ట్రాన్‌లు        2) ప్రోటాన్‌లు

3) న్యూట్రాన్‌లు       4) పాజిట్రాన్‌లు 

సమాధానం: 1

2. 1898లో కింది ఏ నమూనాను అభివృద్ధి చేయడం ద్వారా జె.జె.థామ్సన్‌ ప్రసిద్ధి చెందారు?(ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్, 2024)

1) గోల్డ్‌ ఫాయిల్‌ నమూనా        2) ప్లమ్‌ పుడ్డింగ్‌ నమూనా

3) డబుల్‌-స్లిట్‌ నమూనా          4) ఆయిల్‌ డ్రాప్‌ నమూనా

సమాధానం: 2

3. థామ్సన్‌ పరమాణు నమూనా ప్రకారం, ఒక అణువును కిందివాటిలో ఏ పండ్లతో పోలుస్తారు?(ఆర్‌ఆర్‌బీ టెక్నీషియన్‌ గ్రేడ్‌ 3, 2024)

1) ఆపిల్‌     2) అరటి        3) పుచ్చకాయ    4) మామిడి

సమాధానం: 3

4. Which of the following statements about Thomson's model of an atom is INCORRECT?(RRB Technician Grade III, 2024)

1) The negative and positive charges are not equal in magnitude. So, the atom as a whole is not electrically neutral.

2) The positive charge in the atom is spread all over like the red edible part of a watermelon, while the electrons are studded in the positively charged sphere, like the seeds in the watermelon.

3) The negative and positive charges are equal in magnitude. So, the atom as a whole is electrically neutral.

4) An atom consists of a positively charged sphere and the electrons are embedded in it.

Answer: 1


Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram