ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

స్టీఫెన్‌ విలియం హాకింగ్‌

ఈయన ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త. తన జీవిత కాలంలో ‘బ్లాక్‌ హోల్స్‌ (కృష్ణ బిలాలు)’, ‘కాస్మాలజీ (విశ్వ సృష్టిశాస్త్రం)’పై నిరంతర పరిశోధనలు చేశారు.


ఈయన ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త. తన జీవిత కాలంలో ‘బ్లాక్‌ హోల్స్‌ (కృష్ణ బిలాలు)’, ‘కాస్మాలజీ (విశ్వ సృష్టిశాస్త్రం)’పై నిరంతర పరిశోధనలు చేశారు. అమియోట్రోఫిక్‌ లేటరల్‌ స్క్లెరోసిస్‌ (ఏఎల్‌ఎస్‌) వ్యాధి కారణంగా  ఆయన శరీరం చచ్చుబడిపోవడంతో పూర్తిగా చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు. అయినప్పటికీ నిరాశపడకుండా తన సంకల్ప బలంతో సృష్టి రహస్యాలను ఛేదించాలనుకున్నారు. కాస్మాలజీలో ఆయన వెలువరించిన సిద్ధాంతాలు ఎందరికో మార్గదర్శకంగా నిలిచాయి. విజ్ఞానశాస్త్ర పరంగా ఈయన్ను అత్యంత తెలివైన సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్తగా పరిగణిస్తారు. రేపు (జనవరి 8) స్టీఫెన్‌ హాకింగ్‌ జయంతి సందర్భంగా ఆయన జీవితంలోని ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం..!

బాల్యం - వృత్తి జీవితం

  • స్టీఫెన్‌ హాకింగ్‌ 1942, జనవరి 8న ఆక్స్‌ఫర్డ్‌లో జన్మించారు. లండన్‌లోని బైరాన్‌ హౌస్‌ స్కూల్‌లో పాఠశాల విద్యను ప్రారంభించారు. చిన్నతనం నుంచే ఎంతో చురుగ్గా, సృజనాత్మకంగా ఉండేవారు. ఆకాశంలోని నక్షత్రాలు, సూర్య-చంద్రుల గమనాలు, విశ్వం, మానవ పుట్టుక లాంటి విషయాల గురించి ఆలోచిస్తూ, తెలుసుకుంటూ ఉండేవారు. 
  • 1950లో వారి కుటుంబం బిల్‌ హిల్‌ ప్రాంతానికి మారింది. అక్కడి సెయింట్‌ ఆల్బన్స్‌ పాఠశాలలో చేరి, చదువు కొనసాగించారు. అందులో గణిత ఉపాధ్యాయుడిగా ఉన్న దిక్రాన్‌ తహ్తా ప్రేరణతో ఆయనకు మ్యాథ్స్, సైన్స్‌పై ఆసక్తి కలిగింది. విశ్వానికి సంబంధించిన అనేక విషయాలను దిక్రాన్‌ నుంచి స్టీఫెన్‌ తెలుసుకున్నారు. యూనివర్స్‌పై పరిశోధనలకు అక్కడే  బీజం పడింది. 
  • హాకింగ్‌ 1959లో ఆక్స్‌ఫర్డ్‌లోని యూనివర్సిటీ కాలేజ్‌లో చేరారు. అందులో భౌతిక, రసాయనశాస్త్రాలను అభ్యసించారు. 1962లో కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలో ట్రినిటీ కాలేజ్‌లో చేరారు. 
  • ఆ తర్వాత హాకింగ్‌ ఏఎల్‌ఎస్‌ బారిన పడ్డారు. వ్యాధి ప్రభావం వల్ల క్రమేణా ఆయన శరీరమంతా చచ్చుబడిపోయింది. గొంతు మూగబోయింది. అవేమీ లెక్కచేయకుండా ఆయన పట్టుదలతో చదువుపైనే దృష్టి సారించారు. విశ్వం ఏర్పడటం గురించి అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. 1966లో ‘ప్రాపర్టీస్‌ ఆఫ్‌ ఎక్స్‌పాండింగ్‌ యూనివర్సెస్‌’ అనే థీసిస్‌తో కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. విశ్వం ఏకత్వం నుంచి ప్రారంభమైందని పేర్కొంటూ జనరల్‌ రిలేటివిటీ, బిగ్‌బ్యాంగ్‌ థియరీ సహా వివిధ అంశాలను అందులో పేర్కొన్నారు.

పరిశోధనలు

  • ‘ప్రాపర్టీస్‌ ఆఫ్‌ ఎక్స్‌పాండింగ్‌ యూనివర్సెస్‌’ అనే తన డాక్టోరల్‌ థీసిస్‌లో స్టడీ స్టేట్‌ థియరీ గణితశాస్త్ర పరంగా స్వీయ విరుద్ధమని పేర్కొన్నారు. ఈ అనంత విశ్వం singularity అనే చిన్నదైన బిందువుగా ప్రారంభమైందని చెప్పారు. ప్రస్తుతం దీన్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆమోదించారు. 
  • తన చివరి కాలంలో ఆయన మల్టీవర్స్‌ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. బిగ్‌ బ్యాంగ్‌ ద్వారా ఏర్పడిన ఈ విశ్వం.. అనంతంగా ఉన్న యూనివర్సెస్‌లో ఒకటని ఆయన వెల్లడించారు. 2018లో తన చివరి పత్రమైన ‘నోవల్‌ మ్యాథమెటికల్‌ ఫ్రేమ్‌వర్క్‌’లో దీన్ని ప్రస్తావించారు. 

ముఖ్యమైన అవార్డులు - గౌరవాలు

  • 1966లో కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ ఆడమ్స్‌ ప్రైజ్‌తో సత్కరించింది.
  • 1975లో లండన్‌లోని రాయల్‌ ఆస్ట్రోనామికల్‌ సొసైటీ ఎడ్డింగ్‌టన్‌ మెడల్‌ బహూకరించింది.
  • లండన్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజిక్స్‌ 1976లో ఆయనకు మాక్స్‌వెల్‌ మెడల్‌ను అందించింది.
  • 1978లో ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ అవార్డు పొందారు.
  • 1989లో ప్రిన్స్‌ ఆఫ్‌ ఆస్ట్రియస్‌ అవార్డు దక్కింది.
  • రాయల్‌ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ నుంచి 1999లో ఆల్బర్ట్‌ మెడల్‌ను అందుకున్నారు.

చివరగా

  • హాకింగ్‌ టెలిస్కోప్‌ ఉపయోగించకుండానే తన మేధస్సు, ఊహా శక్తులతో ‘బ్లాక్‌ హోల్స్‌’పై అధ్యయనం చేశారు. ‘కాస్మాలజీ’లో వివిధ సిద్ధాంతాలు వెలువరించారు. తన రచనలతో సామాన్యులకు సైతం విశ్వ రహస్యాలు అర్థమయ్యేలా చేశారు. తన పరిశోధనలతో ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు. సంకల్పంతో వైకల్యాన్ని సైతం జయించి అద్భుతాలు సృష్టించవచ్చని ఆయన నిరూపించారు. స్టీఫెన్‌ 2018 మార్చి 14న కేంబ్రిడ్జ్‌లో మరణించారు.  

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

(ఎస్‌ఎస్‌సీ సీజీఎల్, 2022)

Q: స్టీఫెన్‌ హాకింగ్‌ కిందివాటిలో వేటిపై పరిశోధనలు చేశారు?

1) అంకాలజీ                2) జెనెటిక్‌ ఇంజినీరింగ్‌

3) ఆటోమొబైల్స్‌                4) బ్లాక్‌ హోల్స్‌

సమాధానం: 4

(ఏపీపీఎస్సీ గ్రూప్‌ 4, 2012)

Q: స్టీఫెన్‌ హాకింగ్‌ ఒక ప్రసిద్ధ....

1) శాస్త్రవేత్త                2) సంగీతకారుడు

3) నవలా రచయిత        4) కార్టూనిస్ట్‌

సమాధానం: 1

(SSC CGL Tier 2, 2020)

Q: Which of these facts is NOT true about Stephen Hawking?
1) A paralysed man
2) A worthy contemporary of Newton 
3) A brilliant astrophysicist
4) A professor at Cambridge
Answer: 2

(RRB NTPC CBT-I, 2021)

Q: The book 'A Brief History of Time' has been written by:
1) J.V. Narlikar            2) Satyendranath Bose
3) Stephen Hawking        4) C.V. Raman
Answer: 3

 


Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram