ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

ఎంఎస్‌ స్వామినాథన్‌

ఈయన భారతదేశానికి చెందిన ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త. వ్యవసాయం, ఆహార భద్రత, సుస్థిరాభివృద్ధి రంగాల అభివృద్ధికి గణనీయంగా కృషిచేశారు.


ఈయన భారతదేశానికి చెందిన ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త. వ్యవసాయం, ఆహార భద్రత, సుస్థిరాభివృద్ధి రంగాల అభివృద్ధికి గణనీయంగా కృషిచేశారు. ముఖ్యంగా అధిక ఆహారోత్పత్తి సాధించే వంగడాలకు రూపకల్పన చేసి, ఆకలి బాధను తగ్గించడంలో కీలక పాత్ర పోషించారు. ఎక్కువ దిగుబడిని ఇచ్చే పొట్టి గోధుమ రకమైన ‘ఫర్బతిసొనారా’ను అభివృద్ధి చేశారు. వ్యవసాయాభివృద్ధితోనే దేశ ప్రగతి సాధ్యమని ఆయన బలంగా విశ్వసించారు. ఆ రంగంలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు చేశారు. భారతదేశ హరిత విప్లవ పితామహుడనే గొప్ప కీర్తిని గడించారు. దేశంలో రైతుల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడిన ఈ మహనీయుడి జీవితంలోని ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం..!

బాల్యం - వృత్తి జీవితం

  • ఎంఎస్‌ స్వామినాథన్‌ తమిళనాడులోని కుంభకోణంలో 1925, ఆగస్టు 7న జన్మించారు. పూర్తి పేరు మాన్‌కొంబు సాంబశివన్‌ స్వామినాథన్‌. 
  • కుంభకోణంలోని క్యాథలిక్‌ లిటిల్‌ ఫ్లవర్‌ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. చిన్నతనం నుంచే ఆయనకు వ్యవసాయం పట్ల ఆసక్తి ఉండేది. రైతులతో మాట్లాడుతూ వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ ఉండేవారు.  
  • పాఠశాల విద్య తర్వాత కుటుంబ సభ్యులు ఆయన్ను వైద్యశాస్త్రం చదవాలని కోరారు. అయితే స్వామినాథన్‌ తనకు నచ్చిన వ్యవసాయ సంబంధ కోర్సులే చదువుతానని పట్టుబట్టారు. అలా కేరళలోని యూనివర్సిటీ ఆఫ్‌ ట్రావెన్‌కోర్‌ (ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్‌ కేరళ)లో బీఎస్సీ జువాలజీలో చేరారు. 1944లో పట్టభద్రుడయ్యారు. 
  • 1950లో కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీకి చెందిన ప్లాంట్‌ బ్రీడింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి తన పరిశోధనలు కొనసాగించారు. 1952లో జన్యుశాస్త్రంలో పీహెచ్‌డీ పొందారు. 
  • తర్వాత విస్కాన్సిన్‌ విశ్వవిద్యాలయానికి వెళ్లి అందులోని జెనెటిక్స్‌ శాఖలో పరిశోధనలు చేశారు.  
  • 1954లో స్వామినాథన్‌ భారతదేశానికి తిరిగి వచ్చారు. కటక్‌లోని సెంట్రల్‌ రైస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో అసిస్టెంట్‌ బొటానిస్ట్‌గా చేరారు. 
  • 1954, అక్టోబరులో ఆయన న్యూదిల్లీలోని ఇండియన్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఏఆర్‌ఐ)లో అసిస్టెంట్‌ సైటోజెనెటిస్ట్‌గా చేరారు. అక్కడే అధిగ దిగుబడి ఇచ్చే వరి, గోధుమ వంగడాల అభివృద్ధి కోసం ఆయన పరిశోధలు చేయడం ప్రారంభించారు. 1961-72 వరకు ఐఏఆర్‌ఐ డైరెక్టర్‌గా పనిచేశారు. 

ముఖ్యమైన పరిశోధనలు

  • 1949-55 కాలంలో ట్రిటికం ఏస్తివం (గోధుమ), ఒరైజా సటైవా (వరి), జనపనార జన్యువులపై పరిశోధనలు చేశారు.
  • 1955-72లో మెక్సికన్‌ మరుగుజ్జు గోధుమ వంగడాలపై పరిశోధనలు చేశారు. ఇండియన్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఏఆర్‌ఐ)లో సైటోజెనెటిక్స్, రేడియేషన్‌ జెనెటిక్స్, మ్యుటేషన్‌ బ్రీడింగ్, గోధుమ - వరి జెర్మోప్లాసం నమూనాలు అభివృద్ధి చేశారు.
  • కాస్త తక్కువ ఎత్తులో దృఢంగా నిలిచి, ఎక్కువ దిగుబడి ఇచ్చే వరి వంగడాల సృష్టిపై స్వామినాథన్‌ పరిశోధనలు చేశారు. అవి సఫలీకృతం అయ్యాయి. 1960కి ముందు హెక్టారుకు రెండు టన్నులుగా ఉన్న వరి దిగుబడి.. రెట్టింపైంది.
  • స్వామినాథన్‌ ‘ఫర్బతిసొనారా’ అనే అధిక దిగుబడి ఇచ్చే గోధుమ రకాన్ని ప్రవేశపెట్టారు. 1967 నాటికి ఇది విస్తృత ప్రాచుర్యం పొందింది. దీని ద్వారా హెక్టారుకు నాలుగున్నర టన్నుల దిగుబడి వచ్చింది. స్వామినాథన్‌ దీన్ని సతత హరితవిప్లవం (ఎవర్‌గ్రీన్‌ రివల్యూషన్‌)గా పేర్కొన్నారు. భారతదేశ హరిత విప్లవ పితామహుడిగా ఆయన పేరు మారుమోగింది. 
  • వరి, గోధుమల అధిక ఉత్పత్తి కారణంగా ఇతర దేశాల నుంచి ఆహారధాన్యాలను దిగుమతి చేసుకోవడం తగ్గింది. 

ముఖ్యమైన అవార్డులు - గౌరవాలు

  • 1961లో శాంతిస్వరూప్‌ భట్నాగర్‌ అవార్డు పొందారు. 
  • 1965లో చెకొస్లోవేకియా అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ నుంచి మెండల్‌ మెమోరియల్‌ మెడల్‌ పొందారు.
  • 1971లో రామన్‌ మెగసెసే అవార్డు, 1986లో ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ ప్రపంచ సైన్స్‌ అవార్డు అందుకున్నారు.
  • 1981-84 వరకు ఐక్యరాజ్యసమితికి చెందిన సలహా కమిటీ ‘సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఫర్‌ డెవలప్‌మెంట్‌’కు అధ్యక్షుడిగా పనిచేశారు. 
  • 1984-90 వరకు ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆన్‌ నేచర్‌ (ఐయూసీఎస్‌)కు ప్రెసిడెంట్‌గా ఉన్నారు. 
  • భారతదేశ పౌర పురస్కారాలైన పద్మశ్రీ (1967), పద్మవిభూషణ్‌ (1989), భారతరత్న (2024) పొందారు. 

చివరగా

  • ప్రస్తుతం మన దేశం ధాన్యం నిల్వల్లో స్వయం సమృద్ధి సాధించి ఇతర దేశాలకు ఆహారోత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి చేరిందంటే దానికి స్వామినాథన్‌ పరిశోధనలే కారణం. హరిత విప్లవంతో భారత పంటపొలాల ముఖ చిత్రాన్నే మార్చేశారు. వ్యవసాయాన్ని ఆధునికీకరించే దిశగా అద్భుతమైన ప్రయత్నాలు చేశారు. దేశ ఆహార భద్రతకు ఇవి ఎంతగానో తోడ్పాటు అందించాయి. రైతుల ఆదాయాలూ రెట్టింపయ్యాయి. ఆహార కొరత నుంచి స్వయం సమృద్ధి సాధించే దిశగా దేశం తీసుకున్న అనేక నిర్ణయాల్లో స్వామినాథన్‌ కీలక పాత్ర పోషించారు. ఈయన 2023, సెప్టెంబరు 28న చెన్నైలో మరణించారు. 

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

(యూపీ టెట్‌ 2018)

Q: ఎంఎస్‌ స్వామినాథన్‌ ఎవరు? 

1) జర్నలిస్ట్‌            2) వ్యవసాయ శాస్త్రవేత్త

3) పర్యావరణవేత్త        3) పక్షిశాస్త్రవేత్త

సమాధానం: 2

(దిల్లీ పోలీస్‌ కానిస్టేబుల్, 2023), (ఓపీఎస్‌సీ ఓఎస్‌ఏ 2022)

Q: భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి కిందివారిలో ఎవరు సతత హరితవిప్లవం అనే పదాన్ని ఉపయోగించారు?

1) రాజ్‌ కృష్ణ                2) ఆర్‌కేవీ రావు

3) ఎంఎస్‌ స్వామినాథన్‌        4) నార్మన్‌ బోర్లాగ్‌

సమాధానం: 3

(SSC GD Constable 2024)

Q: Who coined the term ‘Evergreen Revolution’ to increase agriculture production in India? 
1) Mahatma Gandhi         2) Ram Manohar Lohiya  
3) R.V.Rao             4) M.S.Swaminathan 
Answer: 4

(RRB NTPC CBT 2, 2022)

Q: Which term did the farm scientist M S Swaminathan coin, which implies productivity improvement in perpetuity without ecological and social harm?
1) Green Revolution            2) Farm-fresh Revolution
3) Evergreen Revolution        4) Forever Revolution
Answer: 4


Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram