ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

చార్లెస్‌ బాబేజ్‌

చార్లెస్‌ కృషి ఫలితంగా మానవ అవసరం లేకుండా లెక్కించగల యంత్రాల రూపకల్పనకు పునాది ఏర్పడింది. ఆయన కంప్యూటింగ్‌ ప్రయోజనాల కోసం డిజైన్లు రూపొందించారు.


ఈయన ఇంగ్లండ్‌కు చెందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త, ఆవిష్కర్త. మొదటి ఆటోమేటిక్‌ డిజిటల్‌ కంప్యూటర్‌ను రూపొందించారు. చార్లెస్‌ కృషి ఫలితంగా మానవ అవసరం లేకుండా లెక్కించగల యంత్రాల రూపకల్పనకు పునాది ఏర్పడింది. ఆయన పూర్తి స్థాయి యంత్రాల కోసం కాకుండా కంప్యూటింగ్‌ ప్రయోజనాల కోసం డిజైన్లు రూపొందించారు. ప్రస్తుతం మనం ఉపయోగిస్తోన్న కంప్యూటర్ల పరిణామక్రమానికి మూలం బాబేజే. అందుకే ఈయన్ను ‘ఫాదర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌’గా పేర్కొంటారు. డిసెంబరు 26న చార్లెస్‌ జయంతి సందర్భంగా ఆయన జీవితంలోని ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం..!

బాల్యం - వృత్తి జీవితం

  • చార్లెస్‌ బాబేజ్‌ 1791, డిసెంబరు 26న వాల్‌వర్త్, లండన్‌లో జన్మించారు. 
  • చిన్నతనంలో అనారోగ్య సమస్యల కారణంగా ఇంటి వద్దే ట్యూటర్ల సాయంతో విద్యను అభ్యసించారు. తర్వాత ఎన్‌ఫీల్డ్‌లోని హోమ్‌వుడ్‌ అకాడమీలో చేరారు. అక్కడ ఆయనకు గణితం పట్ల ఆసక్తి కలిగింది. పాఠశాల లైబ్రరీలోని అనేక మ్యాథ్స్‌ పుస్తకాలను ఆయన సాధన చేశారు. ఇటాలియన్‌ గణిత శాస్త్రవేత్తలైన జోసెఫ్‌ లూయిస్‌ లెగ్రాంజ్, మరియా గాయెటానా అగ్నేసి రచించిన ఆధునిక గణిత గ్రంథాలను స్వయంగా అధ్యయనం చేశారు. 
  • 1810లో ఆయన గణిత అధ్యయనం కోసం కేంబ్రిడ్జ్‌లోని ట్రినిటీ కాలేజ్‌లో చేరారు. అందులో బోధించే అంశాలు అప్పటికే తాను నేర్చుకుని ఉండటంతో వాటి పట్ల నిరాసక్తత ఏర్పడింది. 
  • కేంబ్రిడ్జ్‌లోని గణిత పాఠ్యాంశాలను ఆధునికీకరించి, సమకాలీన గణిత అభ్యాసాలను బోధించేలా చర్యలు చేపట్టాలని చార్లెస్‌ భావించారు. ఇందుకు అనుగుణంగా తన స్నేహితులైన జాన్‌ హెర్షెల్, జార్జ్‌ పీపాక్‌తో కలిసి 1812 లో అనలిటికల్‌ సొసైటీని స్థాపించారు. ఇందులో ఖండాంతర గణిత సంజ్ఞామానం (modern continental mathematical notation), పద్ధతులను అధ్యయనం చేసేవారు. 
  • 1812లో బాబేజ్‌ కేంబ్రిడ్జ్‌లోని పీటర్‌హౌస్‌కు బదిలీ అయ్యారు. 1814లో పట్టభద్రుడయ్యారు. 1817లో ఎంఏ పట్టా పొందారు. 
  • 1815లో ఖగోళశాస్త్రంపై రాయల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉపన్యాసాలు ఇచ్చారు. 

కంప్యూటర్‌ రూపకల్పన

  • 1821-22లో నేవిగేషన్‌ టూల్‌ అయిన ‘ది నాటికల్‌ అల్మానెక్‌’ భాగాలను తిరిగి గణించే సమయంలో ఆ లెక్కల పట్టీలో వ్యత్యాసాలు ఉన్నట్లు బాబేజ్‌ గమనించారు. అప్పుడే దోష రహిత పట్టీలను ఉత్పత్తి చేయగల యాంత్రిక కాలిక్యులేటర్‌ను రూపొందించాలని ఆయన ఆలోచించారు. పునరావృత గణన ప్రక్రియను యాంత్రీకరించాలనుకున్నారు. అది వేగంగా, కచ్చితత్వంతో, తక్కువ శ్రమతో కూడిందై ఉండాలని భావించారు. 
  • దీనికి అనుగుణంగా 1822లో ‘థియరిటికల్‌ ప్రిన్సిపల్స్‌ ఆఫ్‌ మెషినరీ ఫర్‌ కాలిక్యులేటింగ్‌ టేబుల్స్‌’ అనే పత్రాన్ని ప్రచురించారు. ‘డిఫరెన్స్‌ ఇంజిన్‌’ను నిర్మించేందుకు బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని సంప్రదించారు. దీనికి ప్రభుత్వ ఆమోదంతోపాటు గ్రాంట్‌ కూడా లభించింది. 
  • డిఫరెన్స్‌ ఇంజిన్‌ ద్వారా పరిమిత వ్యత్యాసాల సూత్రాన్ని (principle of finite differences) ఉపయోగించి బహుపది గణనలను (polynomial calculations) ఆమోమేట్‌ చేయాలని భావించారు. అయితే పెరుగుతున్న ఖర్చులు, సాంకేతిక ఇబ్బందుల కారణంగా దీన్ని మధ్యలోనే నిలిపివేశారు. అయితే సంక్లిష్టమైన అంకగణితాన్ని యాంత్రిక మార్గాల ద్వారా నిర్వహించవచ్చని ఈ డిజైన్‌ రుజువు చేసింది. 
  • దీని ప్రేరణతో ఆయన అనలిటికల్‌ ఇంజిన్‌ను రూపొందించాలనుకున్నారు. విభిన్న సమస్యలను గణించే సాధారణ, ప్రయోజనకర పరికరంగా దీన్ని తయారు చేయాలనుకున్నారు. 
  • 1837లో దీన్ని తయారు చేశారు. ఇందులో అంకగణితం, తార్కిక కార్యకలాపాల కోసం ఒక మిల్‌ (ప్రాసెసర్‌); డేటా, సూచనల కోసం ఒక స్టోర్‌ (మెమరీ); సెంట్రల్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ (సీపీయూ), అవుట్‌పుట్‌ యూనిట్‌ (ప్రింటర్‌) సహా ప్రస్తుతం మనం ఉపయోగిస్తోన్న కంప్యూటర్‌లోని అన్ని ప్రాథమిక అంశాలు ఉన్నాయి. ఇది ప్రపంచంలోనే మొదటి కంప్యూటర్‌ డిజైన్‌గా నిలిచింది. 
  • ప్రపంచంలోనే మొట్టమొదటి కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌గా పరిగణించే అడా లవ్లేస్‌ ‘అనలిటికల్‌ ఇంజిన్‌’ రూపకల్పనలో బాబేజ్‌తో కలిసి పనిచేశారు. 

అవార్డులు - గౌరవాలు

  • 1816లో రాయల్‌ సొసైటీ ఫెలోగా ఎన్నికయ్యారు.
  • 1824లో రాయల్‌ ఆస్ట్రోనామికల్‌ సొసైటీ నుంచి బంగారు పతకం పొందారు.
  • 1932లో నైట్‌ ఆఫ్‌ ది రాయల్‌ గ్వెల్పిక్‌ ఆర్డర్‌ (కేహెచ్‌)గా (Knight of the Royal Guelphic Order (KH)) నియమితులయ్యారు. 
  • 1832-35 కాలంలో అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌లో గౌరవ విదేశీ సభ్యుడిగా ఉన్నారు. 

చివరగా

  • ప్రస్తుతం మనం ఉపయోగిస్తోన్న కంప్యూటర్లకు మూలం నాడు బాబేజ్‌ చేసిన ప్రయోగాలే. తప్పులు లేకుండా గణిత పట్టికలను తయారు చేయాలన్న ఆయన ఆలోచన ఫలితంగానే ఇవి రూపుదిద్దుకున్నాయి. శాస్త్ర, సాంకేతిక రంగంలో తనదైన ముద్ర వేసిన బాబేజ్‌ 1987, అక్టోబరు 18న లండన్‌లో మరణించారు.

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, 2021), (బిహార్‌ సీఈటీ - బీఈడీ, 2020)

Q: ‘ఫాదర్‌ ఆఫ్‌ కంప్యూటర్స్‌’ అని కింది ఎవర్ని పిలుస్తారు?

1) చార్లెస్‌ బాబేజ్‌            2) జాన్‌ అటానాసాఫ్‌

3) చార్లెస్‌ బాచ్‌మన్‌        4) అలాన్‌ ట్యూరింగ్‌

సమాధానం: 1

(UKPSC RO/ARO, 2016)

Q: The first mechanical computer designed by Charles Babbage was called?
1) Abacus                    2) Analytical Engine
3) Calculator                4) Central processing unit (CPU)
Answer: 2
 
(RRB NTPC Tier I, 2016)

Q: Who is considered the world's first programmer?
1) Alan Turing            2) Ada Lovelace
3) Tim Berners - Lee        4) Steve Wozniak
Answer: 2 


Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram