ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

సలీం అలీ 

సలీంను ‘బర్డ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’గా పిలుస్తారు. భారతదేశమంతటా వివిధ రకాల పక్షుల గురించి క్రమబద్ధంగా సర్వేలు నిర్వహించిన మొదటి వ్యక్తిగా ఈయన పేరొందారు.


ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ పక్షి శాస్త్రవేత్త (ఆర్నిథాలజిస్ట్‌). సలీంను ‘బర్డ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’గా పిలుస్తారు. భారతదేశమంతటా వివిధ రకాల పక్షుల గురించి క్రమబద్ధంగా సర్వేలు నిర్వహించిన మొదటి వ్యక్తిగా ఈయన పేరొందారు. దేశంలో పక్షిశాస్త్రానికి (ఆర్నిథాలజీ) ఈయన వల్లే ప్రాచుర్యం లభించింది. దాని అభివృద్ధికి అనేక గ్రంథాలు రాశారు. వివిధ రకాల జాతుల పక్షులను కనుక్కుని, వాటికి పేర్లు పెట్టారు. అంతరించిపోతున్న జాతులను గుర్తించి, వాటి సంరక్షణకు పూనుకున్నారు. ప్రకృతి వనరుల అభివృద్ధి, జీవవైవిధ్య సంరక్షణకు ఎంతగానో పాటుపడ్డారు. నవంబరు 12న సలీం జయంతి సందర్భంగా పోటీపరీక్షల నేపథ్యంలో ఆయన జీవితంలోని ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం..!

బాల్యం - వృత్తి జీవితం

  • సలీం అలీ 1896, నవంబరు 12న బొంబాయిలోని ఖేత్వాడిలో జన్మించారు. అసలు పేరు సలీం మొయిజుద్దీన్‌ అబ్దుల్‌ అలీ. 
  • చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడంతో సలీం మేనమామ అమీరుద్దీన్‌ తయాబ్జీ వద్ద పెరిగారు. తన ఇద్దరు సోదరీమణులతో కలిసి బొంబాయిలోని జెనానా బైబిల్‌ అండ్‌ మెడికల్‌ మిషన్‌ గర్ల్స్‌ హైస్కూల్‌లో విద్యను అభ్యసించారు. చదువుపై ఆయనకు అంతగా ఆసక్తి ఉండేది కాదు. 
  • అమీరుద్దీన్‌ ఆ కాలంలో తుపాకీతో వేటాడే క్రీడ ఆడేవారు. సలీంకు అది నచ్చడంతో ఆయన వద్ద దాన్ని నేర్చుకున్నారు. వేటకు సంబంధించిన పుస్తకాలు చదివేవారు. 
  • 1913లో బాంబే విశ్వవిద్యాలయం నుంచి మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణులయ్యారు. అదే సంవత్సరం జంతుశాస్త్రాన్ని అభ్యసించేందుకు సెయింట్‌ జేవియర్‌ కాలేజ్‌లో చేరారు. 1914లో చదువును మధ్యలో ఆపేసి తన కుటుంబ వ్యాపారమైన మైనింగ్, కలప ట్రేడింగ్‌ను నిర్వహించేందుకు బర్మాలోని టావోయ్‌కు వెళ్లారు. అక్కడి అటవీ ప్రాంతం ఆయన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అక్కడ అనేక ప్రకృతి సంబంధ విశేషాలను ఆయన తెలుసుకున్నారు.
  • 1930లో వీవర్‌ పక్షి స్వభావం, లక్షణాలను వివరిస్తూ ఆయన ఒక పరిశోధనా పత్రాన్ని ప్రచురించారు. ఇది ఆయనకు పేరుప్రతిష్ఠలు తెచ్చిపెట్టింది. 
  • ఆయన తన పరిశోధనలు, సేకరించిన వివరాలతో అనేక పుస్తకాలు రచించారు. 
  • దేశానికి స్వాతంత్య్రం వచ్చాక వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ సమతౌల్య కార్యక్రమాల అమలులో ప్రభుత్వానికి సూచనలు చేశారు.

ప్రముఖ రచనలు

  • 1941లో ది బుక్‌ ఆఫ్‌ ఇండియన్‌ బర్డ్స్‌ పుస్తకం రాశారు.
  • 1964-74 కాలంలో ‘ది హ్యాండ్‌బుక్‌ ఆఫ్‌ ది బర్డ్స్‌ ఆఫ్‌ ఇండియా అండ్‌ పాకిస్థాన్‌’ అనే 10 వాల్యూమ్‌ల రచనను తీసుకొచ్చారు. దీన్ని రాయడంలో ఎస్‌ డిల్లాన్‌ రిప్లీ సహకారం అందించారు.
  • 1977లో ‘ఫీల్డ్‌ గైడ్‌ టు ది బర్డ్స్‌ ఆఫ్‌ ది ఈస్ట్రన్‌ హిమాలయాస్‌’ పుస్తకం రాశారు. 
  • 1983లో ఎస్‌ డిల్లాన్‌ రిప్లీతో కలిసి ‘ఎ పిక్టోరియల్‌ గైడ్‌ టు ది బర్డ్స్‌ ఆఫ్‌ ది ఇండియన్‌ కాంటినెంట్‌’ రచించారు.

అవార్డులు - గౌరవాలు

  • ఆసియాటిక్‌ సొసైటీ నుంచి 1953లో జాయ్‌ గోవింద లా గోల్డ్‌ మెడల్‌ పొందారు. 
  • అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయం (1958), దిల్లీ విశ్వవిద్యాలయం (1973), ఆంధ్ర విశ్వవిద్యాలయం (1978) నుంచి గౌరవ డాక్టరేట్లు పొందారు.
  • 1969లో ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ అండ్‌ నేచురల్‌ రిసోర్సెస్‌ అందించే జాన్‌ సి ఫిలిప్స్‌ స్మారక బహుమతి అందుకున్నారు.
  • 1973లో యూఎస్‌ఎస్‌ఆర్‌ అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ఆయనకు పావ్లోస్కీ సెంటెనరీ మెమోరియల్‌ మెడల్‌ను ప్రదానం చేసింది. అదే ఏడాది నెదర్లాండ్స్‌ యువరాజు బెర్న్‌ హార్డ్‌ ఆయన్ను కమాండర్‌ ఆఫ్‌ ది నెదర్లాండ్స్‌ ఆర్డర్‌ ఆఫ్‌ ది గోల్డెన్‌ ఆర్క్‌గా నియమించారు. 
  • 1976లో జె.పాల్‌ గెట్టి వైల్డ్‌లైఫ్‌ కన్జర్వేషన్‌ బహుమతి అందుకున్నారు. 
  • 1985లో రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు.

చివరగా

  • భారతదేశంలో పక్షుల అధ్యయనాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో సలీం ఎంతగానో కృషి చేశారు. పక్షులపై ఆయన చేసిన పరిశోధనలు నేటికీ ఎంతో మందికి మార్గదర్శకంగా, స్ఫూర్తిమంతంగా నిలుస్తాయి. ఆయన జీవితంలో దాదాపు 60ఏళ్లు పూర్తిగా పక్షుల గురించిన పరిశోధనల్లోనే గడిపారు. స్వాతంత్య్రానంతరం నిధుల కొరత కారణంగా ప్రభుత్వం బాంబే నేచురల్‌ హిస్టరీ సొసైటీని మూసేయాలని భావించింది. అయితే 200 ఏళ్ల చరిత్ర కలిగిన సొసైటీ మూతపడకుండా, సలీం ఎంతగానో ప్రయత్నించారు. అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూకు స్వయంగా లేఖ రాసి, దాన్ని పునరుద్ధరించారు.  

 


Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram