ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంపొందించే లక్ష్యంతో ఏటా సెప్టెంబరు 9న ‘ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) దినోత్సవం’ (World Electric Vehicle - EV Day)గా నిర్వహిస్తారు. వాహన కాలుష్యాన్ని తగ్గించడానికి ఎలక్ట్రిక్ వాహనాల వాడకం ప్రత్యామ్నాయ మార్గం. ప్రయాణ సమయంలో ఇవి ఎలాంటి శబ్దం చేయవు, వీటి నుంచి పొగ విడుదల కాదు, సంప్రదాయ ఇంధన వాహనాలతో పోలిస్తే ఈవీల నిర్వహణ వ్యయం తక్కువ. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వీటిని ఉపయోగించడం ఎంతో ముఖ్యం. కర్బన ఉద్గారాలను తగ్గించడంలో ఎలక్ట్రిక్ వాహనాల పాత్రను తెలపడంతోపాటు వీటి వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలను ప్రజలకు వివరించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.