ఎయిర్‌పోర్ట్‌ లేని దేశాల జాబితా

ఎయిర్‌పోర్ట్‌ లేని దేశాల జాబితా

దేశాభివృద్ధికి కీలకమైన మౌలిక సదుపాయాల్లో విమానయాన రంగం ఒకటి. వాయుమార్గాల ద్వారా రవాణా అనేది వేగవంతమైన, ఖరీదైన విధానం. ఈ రంగం ఆధునిక ప్రపంచంలో రవాణాలో అనేక విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ప్రయాణికులు, సరకుల తరలింపులో దేశాలను, దూరాలను దగ్గర చేస్తూ పర్యాటకం, వాణిజ్యం లాంటి ఎన్నో రంగాలకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు విమానయాన రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఎయిర్‌పోర్ట్స్‌ నిర్మాణం - విస్తరణ, కొత్త టెర్మినళ్ల ఏర్పాటు లాంటి అంశాలపై దృష్టి సారిస్తున్నాయి. అయితే ప్రపంచంలోని కొన్ని దేశాల్లో నేటికీ ఎయిర్‌పోర్టులు లేవు.. అక్కడ విమానాలు దిగలేవు. అవేంటో ఇవాళ్టి స్టడీ జోన్‌లో చూసేద్దాం..!

  • రోడ్లు, రైలు మార్గాలు లేని దట్టమైన అటవీ ప్రాంతాలు, పర్వతాలు, లోయలు, సముద్ర ద్వీప ప్రాంతాలను చేరుకోవడానికి ఉపయోగించే విధానం విమానయానం. వరదలు, భూకంపాలు, యుద్ధం లాంటి అత్యవసర పరిస్థితుల్లో; భిన్న వాతావరణ సమయాల్లో దీని ద్వారా ఎక్కడికైనా వేగంగా వెళ్లొచ్చు. 
  • ప్రపంచంలోని అనేక దేశాలు, ప్రాంతాలు దీని ద్వారా అనుసంధానమయ్యాయి. ఇవి రాకపోకలను సులభతరం చేశాయి.
  • పేద - ధనిక, అభివృద్ధి చెందిన - చెందని లాంటి అంశాలతో సంబంధం లేకుండా దాదాపు దేశాలన్నీ తమకు చెందిన ముఖ్యమైన ప్రాంతాలు, నగరాల్లో ఎయిర్‌పోర్టులను నిర్మించి.. విమానయానాన్ని ప్రోత్సహిస్తున్నాయి. అయితే భౌగోళిక అంశాలు, పరిమాణం, ఐసోలేషన్‌ కారణంగా కొన్ని దేశాల్లో నేటికీ విమానాలు సంచరించే వీలు లేదు. 
  • ఇవన్నీ ప్రకృతి సౌందర్యాలు, అనేక ఆకర్షణలకు నెలవైనప్పటికీ ఎక్కువ పర్వత ప్రాంతాలు కలిగి, రన్‌వే సౌకర్యం లేకుండా, పరిమాణంలో చిన్నగా ఉన్నాయి. అంతర్జాతీయ పౌర, సరకు రవాణాలకు ఈ దేశాలు హెలిపోర్ట్‌లు, సమీప దేశాల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాలు, సముద్ర మార్గాలు, రోడ్డు - రైలు మార్గాలపై ఆధారపడతాయి. వాటిని పరిశీలిస్తే..

1. అండోరా

  • ఇది పశ్చిమ యూరప్‌లో ఫ్రాన్స్, స్పెయిన్‌ దేశాల మధ్య పైరినీస్‌ పర్వతాల్లో ఉంది. 
  • రాజధాని అండోరా లా వెల్లా.
  • విమానాశ్రయం లేని దేశాల్లో పెద్దది. విస్తీర్ణం 468 చ.మి.మీ. తక్కువ వైశాల్యం కలిగిన దేశాల జాబితాలో 16వ స్థానంలో ఉంది. 
  • దీని జనాభా 81,938. తక్కువ ప్రజలు కలిగిన దేశాల జాబితాలో 11వ స్థానంలో ఉంది. 
  • ఎక్కువ భూభాగం పర్వతాలు, గుట్టలతో నిండి ఉండటం వల్ల విమానం టేకాఫ్‌కు రన్‌ వే కష్టంగా ఉంటుంది. 
  • ఈ దేశం అనేక ప్రకృతి సౌందర్యాలకు నిలయం. ఇక్కడి పర్వత రహదారులు, సీ రిసార్ట్‌లు ఎంతోమంది పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. అంతేకాక అమ్మకం పన్ను లేకపోవడం వల్ల లగ్జరీ వస్తువులు, ఎలక్ట్రిక్‌ పరికరాలు తక్కువ ధరలకు లభిస్తాయి. ఈ కారణంగానే ఎంతో మంది ఈ దేశానికి వస్తుంటారు. అండోరాను వార్షికంగా 1.2 కోట్ల మంది సందర్శిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
  • స్పెయిన్‌లోని అండోరా - లా స్యూ డి ఉర్గెల్‌ విమానాశ్రయం ఈ దేశానికి 12 కి.మీ. దూరంలో ఉంది. దీని ద్వారా అండోరాకు చేరుకోవచ్చు.

2. మొనాకో

  • పశ్చిమ యూరప్‌లోని ఫ్రెంచ్‌ రివేరాలో ఉంది. ఇది మూడు వైపులా ఫ్రెంచ్‌తో సరిహద్దు పంచుకుంటుంది. నాలుగో వైపు మధ్యధరా సముద్రం ఉంది. 
  • విస్తీర్ణం 2.1 చ.కి.మీ. వాటికట్‌ సిటీ తర్వాత తక్కువ వైశాల్యం కలిగిన దేశం. దేశ జనాభా 38,222. 
  • ఈ దేశం ఎక్కువ మంది ధనవంతులకు నిలయం. ఇది ప్రతి సంవత్సరం ఫార్ములా 1 గ్రాండ్‌ ప్రిక్స్‌ను నిర్వహిస్తుంది. ఇక్కడ అనేక క్యాసినోలు, సముద్ర తీర పర్యాటకానికి ప్రసిద్ధి. ఈ దేశంలో సేల్స్‌ టాక్స్‌ లేదు. ఈ కారణంగానే ఎంతోమంది ఇక్కడికి వస్తుంటారు. ఏటా ఈ దేశానికి సుమారు 340,000 పర్యాటకులు వస్తారని అంచనా.
  • తక్కువ భౌగోళిక పరిమాణం కారణంగా మొనాకోలో విమాన సౌకర్యం లేదు. హెలికాప్టర్‌ ప్రయాణానికి ఫాంట్విల్లేలో సొంత హెలిపోర్ట్‌ను ఏర్పాటు చేసుకుంది.
  • ఫ్రాన్స్‌లోని నైస్‌ ఓట్‌ డి అజుర్‌ విమానాశ్రయం దీనికి 30 కి.మీ. దూరంలో ఉంది. 

3. లీచ్టెన్‌స్టెయిన్‌

  • మధ్య ఐరోపాలో స్విట్జర్లాండ్, ఆస్ట్రియా దేశాల మధ్య ఉంది. 
  • రాజధాని వాడుజ్‌.
  • విస్తీర్ణం 160.5 చ.కి.మీ. జనాభా 40,197.
  • అందమైన కొండలు, మధ్యయుగం నాటి కోటలకు ఇది నిలయం. ఈ దేశం అధిక ఆదాయ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది. ప్రైవేట్‌ బ్యాంకింగ్, సంపద నిర్వహణకు ఇది ప్రసిద్ధి చెందింది. ఎలక్ట్రానిక్స్, ఔషధాల తయారీ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. ఐవోక్లార్‌ వివాడెంట్‌ అనే కంపెనీ ఈ దేశం కేంద్రంగా దంత ఉత్పత్తులను భారీగా ఉత్పత్తి చేస్తోంది. ఈ కారణంగానే లీచ్టెన్‌స్టెయిన్‌ను ‘ఫాల్స్‌ టీత్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ది వరల్డ్‌’గా పిలుస్తారు.
  • తక్కువ పరిమాణం, పర్వత భూభాగం, చదునైన నేల తక్కువగా ఉండటంతో ఇక్కడ విమానాశ్రయం లేదు. బల్జర్స్‌లో ఒక హెలిపోర్ట్‌ ఉంది. 
  • ఈ దేశానికి సమీపంలోని విమానాశ్రయం స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌ ఎయిర్‌పోర్ట్‌. 

4. శాన్‌ మారినో

  • దక్షిణ ఐరోపాలో అపెనైన్‌ (Apennine) పర్వతాల ఈశాన్య భాగంలో ఇటాలియన్‌ ద్వీపకల్పంలో ఉంది. 2008లో యునెస్కో దీన్ని ప్రపంచ వారత్వ ప్రదేశాల్లో ఒకటిగా చేర్చింది. ఈ దేశం ప్రపంచంలోని పురాతన గణతంత్ర రాజ్యాల్లో ఒకటిగా ఉండటం, ఇందులోని స్మారక చిహ్నాలు, మౌంట్‌ టైటానో చారిత్రక నేపథ్యం దృష్ట్యా యునెస్కో దీనికి ఈ హోదా ఇచ్చింది.
  • విస్తీర్ణం 61.2 చ.కి.మీ. జనాభా 33,977. 
  • దేశం పర్వత ప్రాంతంలో, తక్కువ వైశాల్యంలో ఉండటం, విమానాలు తిరిగేందుకు అవసరమైన రన్‌ వే లేకపోవడం లాంటి కారణాల వల్ల ఇక్కడ ఎయిర్‌పోర్ట్‌ లేదు. అత్యవసర సమయాల్లో వినియోగించుకునేందుకు హెలిపోర్ట్‌ ఉంది.
  • ఇక్కడి మధ్యయుగం నాటి కట్టడాలు, పర్వత సోయగాలు, పురాతన భవనాలు లాంటివి పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఏటా ఈ దేశానికి సుమారు 20 లక్షలమంది విదేశీయులు వస్తారని అంచనా.
  • ఇటలీలోని బోలోగ్నా లేదా రిమిని విమానాశ్రయాలు దీనికి దగ్గర్లో ఉన్నాయి.

5. వాటికన్‌ సిటీ

  • ఇటలీలోని రోమ్‌లో ఉంది.
  • ప్రపంచంలోనే అతి చిన్న దేశం. విస్తీర్ణం 0.44 చ.కి.మీ. (భారత్‌లోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్‌ 2 విస్తీర్ణం 0.45 చ.కి.మీ.). జనాభా 842. 
  • తక్కువ వైశాల్యం కారణంగా ఇక్కడ ఎయిర్‌పోర్ట్‌ కట్టడం అసాధ్యం. 
  • ఇక్కడికి ఏటా 68 లక్షలమంది సందర్శకులు వస్తుంటారని అంచనా.
  • దీన్ని చేరుకునేందుకు సందర్శకులు సాధారణంగా రోమ్‌లోని లియొనార్డో డా విన్సీ విమానాశ్రయాన్ని ఆశ్రయిస్తారు.

 

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram