స్వాతంత్య్రోద్యమ కాలంలోని ప్రముఖ వార్తాపత్రికలు

స్వాతంత్య్రోద్యమ కాలంలోని ప్రముఖ వార్తాపత్రికలు

1780లో ప్రచురితమైన బెంగాల్‌ గెజెట్‌ పత్రిక 

స్వాతంత్య్రోద్యమ సమయంలో నాయకుల ఆలోచనలను దేశ ప్రజలకు చాటిచెప్పడంలో.. జాతిని ఏకం చేయడంలో భారతీయ వార్తాపత్రికలు ముఖ్య పాత్ర పోషించాయి. బ్రిటిష్‌ వారి అకృత్యాలు, అన్యాయాలు, అణచివేతలు కళ్లకు కట్టేలా కథనాలు ప్రచురించాయి. వలస పాలనను తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆంగ్లేయుల విధానాలపైనే కాక, నాటి సమాజంలో పేరుకుపోయిన మూఢ విశ్వాసాలు, సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రజలను చైతన్యపరిచాయి. భిన్న మతాలు, జాతులు కలిగిన సమాజంలో ఐక్యతను పెంచి, జాతీయవాదాన్ని పెంపొందించడంలో సాయం చేశాయి. ముఖ్యంగా భారతీయులను ధైర్యవంతులను చేసి, నిరంకుశ పాలకులపై తిరగబడేలా ప్రోత్సహించాయి. దేశ స్వరాజ్య సిద్ధిలో ప్రముఖంగా నిలిచిన వార్తాపత్రికల గురించి పోటీపరీక్షల నేపథ్యంలో ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం..!

దేశంలో పత్రికల ప్రస్థానం.. 

  • మనదేశంలో మొదటి వార్తాపత్రిక బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌ వారెన్‌ హేస్టింగ్స్‌ పదవీకాలంలో ప్రచురితమైంది. ఐర్లాండ్‌కి చెందిన జేమ్స్‌ అగస్టస్‌ హిక్కీ 1780లో ‘ది బెంగాల్‌ గెజెట్‌’ పేరుతో దీన్ని ప్రారంభించారు. ఇది ఆసియాలోనే మొదటి వార్తా పత్రికగా పేరొందింది.   
  • 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు దేశంలోని పత్రికల ముఖచిత్రాన్ని మార్చేసింది. అంతకుముందు ప్రచురితమైన పత్రికలు వినోదం, విజ్ఞానాలతోపాటు సాంఘిక, రాజకీయ సమస్యల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాయి. 
  • 1857 తర్వాత భారతీయ పత్రికలు దేశంలో జాతీయత భావాలను పెంపొందించడం, దేశభక్తిని ప్రబోధించడం, బ్రిటిషర్ల అరాచకాలను - దోపిడీ విధానాలను ఎండగట్టడంపై ఎక్కువగా దృష్టిసారించాయి. 
  • 1905లో నాటి బ్రిటిష్‌ ప్రభుత్వంలో వైస్రాయ్‌గా ఉన్న లార్డ్‌ కర్జన్‌ బెంగాల్‌ రాష్ట్రాన్ని రెండుగా విభజించాడు. దానికి వ్యతిరేకంగా జరిగిన స్వదేశీ ఉద్యమంలో అనేక పత్రికలు ప్రభుత్వ చర్యలను విమర్శిస్తూ, ఉవ్వెత్తున ఎగసిన ప్రజా ఉద్యమానికి మద్దతుగా నిలిచాయి.

వార్తా పత్రికల పట్ల బ్రిటిష్‌ వారి వైఖరి

  • ఆంగ్లేయుల ‘విభజించు - పాలించు’ సిద్ధాంతాన్ని నిలువరించడంలో పత్రికలు ముఖ్య భూమిక పోషించాయి. విభిన్న జాతులు, మతాలు, సంస్కృతులతో కూడిన ప్రజల్లో సమైక్యతను బోధించి, జాతీయవాదాన్ని వ్యాప్తి చేయడంలో ఈ రంగం పాత్ర కీలకం. 
  • ప్రభుత్వ విధానాలు, చర్యలను విశ్లేషించి ప్రజలకు వివరించడంతోపాటు వలస పాలకుల పక్షపాత వైఖరి, ఆర్థిక దోపిడీని తెలిపాయి. 
  • ఆంగ్లేయుల జాత్యహంకార పాలనను, అణచివేత విధానాలను తీవ్రంగా విమర్శించిన అనేక పత్రికలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. భారత శిక్షాస్మృతి, 1860లోని 124A సెక్షన్‌ కింద రాజద్రోహం కేసులు పెట్టింది. ఈ విధంగా భారత స్వాతంత్య్రోద్యమ కాలంలో పత్రికలపై ప్రభుత్వం తీవ్రమైన నిర్బంధ విధానాలను అనుసరించింది. 
  • పత్రికలు బ్రిటిష్‌ ప్రభుత్వం విధించిన కఠిన ఆంక్షలు, అణచివేత విధానాలను తట్టుకొని నిలబడ్డాయి. ఉద్యమకారులు రహస్య ప్రాంతాల్లో పత్రికలను ప్రచురించి, వాటిని గుట్టుగా ప్రజలకు చేరవేసేవారు. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా వాటిని దీటుగా ఎదుర్కొంటూ భారతదేశ స్వాతంత్య్రం కోసం దేశీయ పత్రికా రంగం సాగించిన పోరాటం చిరస్మరణీయం.

 స్వాతంత్య్రోద్యమ కాలం నాటి కొన్ని ముఖ్య వార్తా పత్రికలు 

వార్తా పత్రిక పేరు స్థాపించిన వారు
ది బెంగాల్‌ గెజెట్‌ జేమ్స్‌ అగస్టస్‌ హిక్కీ 
మద్రాస్‌ కొరియర్‌ రిచర్డ్‌ జాన్సన్‌
మిరాత్‌-ఉల్‌-అక్బర్‌ రాజా రామ్మోహన్‌ రాయ్‌  
అమృతబజార్‌ మోతీలాల్‌ ఘోష్, శిశిర్‌ కుమార్‌ ఘోష్‌
వందేమాతరం  బిపిన్‌ చంద్రపాల్‌ 
కామన్‌ వీల్‌ అనిబిసెంట్‌


గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

(టీఎస్‌పీఎస్సీ ఎఫ్‌బీఓ, 2017)

Q: కిందివారిలో వందేమాతరం వార్తా పత్రికకు సంపాదకుడిగా వ్యవహరించింది? 

1) అతుల్య ఘోష్‌     2) అజయ్‌ కుమార్‌ ముఖర్జీ     3) అరబిందో ఘోష్‌    4) బంకిమ్‌ చంద్ర ఛటర్జీ

సమాధానం: 3

(DSSSB TGT Social Science, 2021)
Q: Who was the editor of Bengali newspaper?
1) A. M. Bose     2) Harish Chandra Mukherjee      3) S. N. Banerjee     4) Dwarkanath Tagore
Answer: 3

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram