మానవుడు చేసే అన్ని క్రియలకు మానవ మెదడే మూలం. ఇదే మనం చేసే పనులన్నింటినీ ఆజమాయిషీ చేస్తుంది. నాడీ కణాల నుంచి అందే సంకేతాల కారణంగానే నడవటం, మాట్లాడటం లాంటివి చేస్తాం. ఇలాంటి కదలికలను నియంత్రించే నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యే ‘పార్కిన్సన్స్ డిసీజ్’. మెదడులో నాడీ కణాల మధ్య నిరంతరం సమాచారం మార్పిడి అవుతుంటుంది. ఇందుకు తోడ్పడే రసాయనాలు - ‘డోపమిన్’, ‘ఎపినెప్రిన్’. ఇవి ఒత్తిడి, మానసిక స్థితి, చురుకుదనాన్ని నిర్వహిస్తాయి. వీటి తగ్గుదలే పార్కిన్సన్స్ జబ్బుకు మూలం. నాడీ కణాలు క్షీణించినా, అవి సరిగా పనిచేయకపోయినా వీటి ఉత్పత్తి తగ్గుతుంది. ఫలితంగా కదలికల సమస్యలు మొదలవుతాయి. తల, చేతుల వంటి భాగాలు వణకటం.. బిగుసుకు పోవటం, నడక వేగం తగ్గటం, సరిగా మాట్లాడలేకపోవటం లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి. పార్కిన్సన్స్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా ఏప్రిల్ 11న ‘వరల్డ్ పార్కిన్సన్స్ డే’గా నిర్వహిస్తారు. ముందస్తు రోగనిర్థారణ ప్రోత్సహించడం, మెరుగైన చికిత్స - సంరక్షణ కోసం పరిశోధనలకు మద్దతు ఇవ్వడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం
యూరోపియన్ పార్కిన్సన్ డిసీజ్ అసోసియేషన్ (ఈపీడీఏ) సంస్థ పార్సిన్సన్ వ్యాధిపై విస్తృత ప్రచారం కల్పించేందుకు ఒక రోజు ఏర్పాటు చేయాలని భావించింది. ఈ వ్యాధిని 1817లో మొదటిసారిగా వర్ణించిన డాక్టర్ జేమ్స్ పార్కిన్సన్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఏటా ఏప్రిల్ 11న ‘వరల్డ్ పార్కిన్సన్స్ డే’గా జరుపుకోవాలని తీర్మానించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మద్దతుతో 1997 నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు.
2026 నినాదం: "Bridge the Care Gap"