ఎస్‌పీజీ వ్యవస్థాపక దినోత్సవం

ఎస్‌పీజీ వ్యవస్థాపక దినోత్సవం

స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్‌పీజీ) అనేది భారత ప్రభుత్వానికి చెందిన ఒక ప్రత్యేక భద్రతా దళం. దేశ ప్రధాని, మాజీ ప్రధానులు, వారి కుటుంబ సభ్యులను రక్షించడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎస్‌పీజీ రక్షణలో ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రమే ఉన్నారు. విదేశాలకు వెళ్లినప్పుడు కూడా ప్రధాని భద్రత బాధ్యత వీరిదే. స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ ఏర్పాటుకు గుర్తుగా ఏటా మన దేశంలో ఏప్రిల్‌ 8న ‘ఎస్‌పీజీ వ్యవస్థాపక దినోత్సవం’గా (SPG Rising Day) నిర్వహిస్తారు. ఈ దళం వృత్తి నైపుణ్యం, అంకితభావం, జాతీయ భద్రత పట్ల చూపే నిబద్ధతను గౌరవించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

భద్రత ఇలా..

  • మన దేశంలో అత్యంత విశిష్టమైన, అత్యున్నత స్థాయి శిక్షణ పొందిన భద్రతా దళాల్లో ఎస్‌పీజీ ముందు వరుసలో ఉంది.
  • ఇది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధీనంలో ఉంటుంది. ప్రధాన కార్యాలయం న్యూదిల్లీలో ఉంది.
  • 1985లో ఈ దళం ఏర్పడినప్పటికీ 1988 వరకు ఎలాంటి చట్టపరమైన ఆధారం లేకుండానే పనిచేసింది.
  • 1988లో నాటి రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం ఎస్‌పీజీ యాక్ట్‌ ద్వారా స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌కి చట్టబద్ధమైన హోదా కల్పించింది. దీని ప్రకారం, ప్రధాని - వారి కుటుంబ సభ్యులు దేశ, విదేశాల్లో ఎక్కడ ఉన్నా అన్ని సమయాల్లో వారికి భద్రత కల్పించే బాధ్యత ఎస్‌పీజీదే. ప్రధాని కార్యాలయం, నివాసం, సందర్శించే ఇతర ప్రదేశాల్లో సెక్యూరిటీ ఏర్పాట్లను పర్యవేక్షించే బాధ్యత ఈ దళానిదే.

విధులు..

ఎస్‌పీజీకి కొన్ని నిర్దిష్ట విధులు ఉన్నాయి. అవి:

  • ప్రధాని, వారి కుటుంబ సభ్యులను భౌతిక దాడులు, అపహరణ, హత్యాయత్నాలతో సహా వారి భద్రతకు ముప్పు కలిగించే అన్ని ప్రమాదాల నుంచి రక్షించడం.
  • ప్రధాని, వారి కుటుంబ సభ్యులు భారత్‌లోనూ, విదేశాల్లోనూ పర్యటించే సమయంలో భద్రత కల్పించడం.
  • భారతదేశానికి వచ్చిన విదేశీ ప్రముఖులు, దేశాధినేతల పర్యటనల కోసం భద్రతా ఏర్పాట్ల ప్రణాళిక, అమలులో సాయం చేయడం.
  • ప్రధాని, వారి కుటుంబ సభ్యుల భద్రతను అన్ని సమయాల్లో నిర్ధారించడానికి దేశంలోని ఇతర రక్షణ సంస్థలతో సమన్వయం చేసుకోవడం.
  • ప్రధాని, వారి కుటుంబ సభ్యుల భద్రతకు పొంచి ఉన్న ముప్పులను నిరంతరం పర్యవేక్షించడం, అంచనా వేయడం, వాటి నివారణకు తగిన చర్యలు అమలు చేయడం.
  • ప్రధాని, వారి కుటుంబ సభ్యులు నివసించే అధికారిక నివాసం, వారు వెళ్లే ఇతర ప్రదేశాల్లో భద్రత, రక్షణ కల్పించడం.

చారిత్రక నేపథ్యం

1984, అక్టోబరు 31న ఇందిరా గాంధీ హత్య తర్వాత ప్రధానమంత్రి భద్రతపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శుల కమిటీ సమీక్ష నిర్వహించింది. పీఎం రక్షణపై సూచనలు ఇవ్వాల్సిందిగా 1985, ఫిబ్రవరి 18న బీర్బల్‌నాథ్‌ అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. ప్రధాని రక్షణ కోసం స్పెషల్‌ ప్రొటెక్షన్‌ యూనిట్‌ (ఎస్‌పీయూ)ను ఏర్పాటు చేయాలని ఈ కమిటీ 1985, మార్చిలో ప్రభుత్వానికి నివేదించింది. 1985, మార్చి 30న రాష్ట్రపతి కార్యనిర్వాహక ఉత్వర్వుల ద్వారా కేబినెట్‌ సెక్రటేరియట్‌లో దీని కోసం 819 పోస్టులు సృష్టించారు. 1985, ఏప్రిల్‌ 8న దీని పేరును ‘స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌’గా మార్చారు.

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్‌పీజీ) ఎప్పుడు ఏర్పాటైంది?

(ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌ డి, 2018)

1) 1988          2) 1985        3) 1990          4) 1991

సమాధానం: 2

2. భారత ప్రధానికి రక్షణ కల్పించే బాధ్యత కింది ఏ భద్రతా దళానికి ఉంది?

(ఏసీసీ 122 సీజీఏటీ, 2020)

1) నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌            2) డెల్టా ఫోర్స్‌ వన్‌

3) స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌            4) మార్కోస్‌

సమాధానం: 3

3. 2023 నవంబరులో కేంద్ర ప్రభుత్వం కింది ఎవరిని స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్‌పీజీ) డైరెక్టర్‌ జనరల్‌గా నియమించింది?

(ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్, 2024)

1) రాకేశ్‌ అస్థానా                2) అశోక్‌ కుమార్‌ మిశ్రా

3) అనిల్‌ కుమాన్‌ ధస్మానా        4) అలోక్‌ శర్మ

సమాధానం: 4

4. _______ was raised in 1985 to provide proximate security cover to the Prime Minister, former Prime Ministers and their immediate family members. 
(UP Police Assistant Operator, 2024)
1) The Special Protection Group
2) Assam Rifles 
3) Central Industrial Security Force 
4) Central Reserve Police Force
Ans: 1

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram